మార్కెట్‌ నష్టాలకు మూలకారణాలు ఇవే..

  • In Money
  • January 28, 2019
  • 946 Views
మార్కెట్‌ నష్టాలకు మూలకారణాలు ఇవే..

ముంబయి: భారతీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మధ్యాహ్నం 1.07 గంటలకు సెన్సెక్స్‌ 331 పాయింట్లు నష్టపోయి 35,693 వద్ద ,  నిఫ్టీ 102 పాయింట్లు నష్టపోయి 10,678 వద్ద ట్రేడవుతున్నాయి. నిఫ్టీ50లో 38 కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇండియా బుల్స్, ఐసీఐసీఐ బ్యాంక్‌, యస్‌బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ షేర్లు భారీగా కుంగాయి. జీ ఎంటర్‌టైన్‌ మెంట్‌, భారతీ ఇన్ఫ్రాటెల్‌, ఎల్‌అండ్‌టీ, టీసీఎస్‌, విప్రో లాభాల్లో ట్రేడవుతున్నాయి.

బలహీనమైన మూడో త్రైమాసిక ఫలితాలు..

డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో భారీ కంపెనీలు ఆశించిన  ఫలితాలను వెల్లడించకపోవడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ముఖ్యంగా మారుతీ సుజుకీ లాభాల్లో తగ్గుదల ఆటోమొబైల్‌ రంగంలోని షేర్లపై కూడా కొంత ప్రభావం చూపింది. గత ఏడాదితో పోలిస్తే 17శాతం లాభాన్ని మారుతీ కోల్పోయింది.ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈవో చందాకొచ్చర్‌పై సీబీఐ కేసును నమోదు చేయడంతో ఆ సంస్థ షేర్లు ఒత్తడికి గురయ్యాయి. ఎన్‌పీఏలను దాచి ఫలితాలను ప్రకటించారనే ఆరోపణలు కూడా చందాకొచ్చర్‌పై వచ్చాయి. దీంతో మధుపర్లు విక్రయాలకు పాల్పడ్డారు. దీనికి తోడు హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్‌, ఎస్‌బీఐ బ్యాంక్‌ షేర్ల నష్టాలు సూచీలను కుంగదీశాయి.

ఎఫ్‌ఐఐల విక్రయాలు..

భారత మార్కెట్లలో నుంచి ఎఫ్‌ఐఐలు అమ్మకాలను కొనసాగిస్తున్నారు. జనవరి నెలలో నిఖరంగా రూ.5,000 కోట్ల పెట్టుబడులను వాపస్‌ తీసుకొన్నారు. ఈ ట్రెండ్‌ మార్కెట్లలో కొనసాగవచ్చని నిపుణులు చెబుతున్నారు. గత నెలలో రూ.5,900 కోట్ల పెట్టుబడులు పెట్టగా.. రూ.3,143 కోట్ల మేరకు పెట్టుబడులను వాపస్‌ తీసుకొన్నారు.

బడ్జెట్‌ భయాలు..

ఎన్నికల సంవత్సరం కావడంతో తాత్కాలిక బడ్జెట్‌లో ప్రజాకర్షక పథకాలు ఎక్కువ ఉండవచ్చనే అంచనాలు ఉన్నాయి. దీంతో మార్కెట్లలో విక్రయాలు కొనసాగుతున్నాయి. దీనికి తోడు చైనా-అమెరికా వాణిజ్య యుద్ధం భయలు కూడా మార్కెట్‌ను కుంగదీస్తున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos