త్వరలో జరుగనున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మరోసారి ఘన విజయం సాధించి అధికారం చేపట్టనుందంటూ ఎమ్మెల్యే బోండా ఉమా ధీమా వ్యక్తం చేసారు.శుక్రవారం ఉమ మీడియాతో మాట్లాడుతూ..త్వరలో జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో తెదేపాకు 150 స్థానాలు దక్కడం తథ్యమని ధీమా వ్యక్తం చేసారు.రాష్ట్ర విభజన అనంతరం తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడిపించడానికి సీఎం చంద్రబాబు ఎనలేని కృషి చేసారన్నారు.గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని తెదేపా ప్రభుత్వం నెరవేర్చిందని స్పష్టం చేసారు.కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఎంతోమంది హామీలు ఇచ్చారని అయితే కార్పోరేషన్ ఏర్పాటు చేసి కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించిన ప్రభుత్వం తెదేపా ప్రభుత్వం మాత్రమేనన్నారు.సీఎం చంద్రబాబుతో కలసి రాష్ట్రాభివృద్ధిలో పాలు పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోవడం ప్రజాతీర్పును ఉల్లంఘించడమే అని విమర్శించారు. ఎమ్మెల్యేలు ఎందుకు బయటికి వస్తున్నారో జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాలని బోండా ఉమ హితవు పలికారు.