న్యూ ఢిల్లీ:అత్యవసర పరిస్థితుల్లో మహిళల్ని ఆదుకునేందుకు సహాయవాణి – 112ను మంగళవారం కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇక్కడ ప్రారంభించారు. పోలీసు (100), అగ్ని మాపక దళం(101), ఆరోగ్యం(108) మహిళ (1090) హెల్ప్ లైన్ నంబర్లన్నీంటినీ రద్దు చేసి ఒకే సహాయ వాణి రూపొందించారు. 112 నంబరుకు ఫోన్ డయల్ చేసి స్మార్ట్ ఫోన్ లో పవర్ మీటను ను మూడుసార్లు నొక్కితే అత్యవసర సహాయవాణి కేంద్రం అందుబాటులోకి వస్తుంది. 112 ఇండియా మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ లో ఉచితంగా లభిస్తోంది. అమెరికాలో 911 ఎమర్జెన్సీ సర్వీసుల తరహాలో 112 అన్ని రకాల అత్యవసర సర్వీసులు అందిస్తుందని హోం మంత్రిత్వ శాఖ అధికారులు చెప్పారు. దీంతోపాటు దేశంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్ కతా, ఢిల్లీ, లక్నో, ముంబయి నగరాల్లో నిర్భయ నిధి పథకం నిధులతో సురక్షిత నగరం పథకాన్ని అమలు చేస్తున్నారు.