మళ్లీ స్తబ్దతలోకి పారిశ్రామికోత్పత్తి

  • In Money
  • January 24, 2019
  • 947 Views
మళ్లీ స్తబ్దతలోకి పారిశ్రామికోత్పత్తి

 2019 డిమాండ్‌లో పతనం..- చమురు ధరల ఎఫెక్ట్‌….- పెరుగుతున్న వాణిజ్య లోటు                    న్యూఢిల్లీ : దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి కార్యకలాపాలు మళ్లీ స్తబ్దతలోకి నెట్టబడుతున్నాయని ఓ రిపోర్టులో వెల్లడయ్యింది. అతి స్వల్ప కాలంలోనే దేశీయ డిమాండ్‌ స్తబ్దతలో పడనుందని విశ్లేషించింది. అంతర్జాతీయ బలహీన ఆర్ధిక అంశాలు, 2019 లోకసభ సాధారణ ఎన్నికల నేపథ్యంలో వ్యాపారాల్లో అనిశ్చితి తదితర అంశాలు పారిశ్రామికోత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయని డిఅండ్‌బి విశ్లేషించింది. ఎంచుకున్న లక్ష్యానికి కంటే పన్ను వసూళ్లలో తగ్గుదల చోటుచేసుకోవడం ద్వారా ప్రభుత్వ పెట్టుబడులు పడిపోనున్నాయని, దీంతో పారిశ్రామిక ఉత్పత్తిపై ప్రభావం పడనుందని డూన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ (డిఅండ్‌బి) పేర్కొంది. 2018 డిసెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపి) వృద్ది 1.5-2 శాతానికి పడిపోనుందని అంచనా వేసింది. ఇంతక్రితం నవంబర్‌లో ఐఐపి 0.5 శాతానికి పరిమితమై 17 మాసాల కనిష్ట స్థాయికి పతనమైనట్లు గత వారం కేంద్ర గణంకాల శాఖ ఒక రిపోర్టులో వెల్లడించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తయారీ రంగంలోని కన్సూమర్‌, కాపిటల్‌ గూడ్స్‌ రంగాలు డిమాండ్‌ లేక తీవ్ర ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. 2017 నవంబర్‌లో ఐఐపి ఏకంగా 8.5శాతం వృద్ధిని కనబర్చింది.అనుకోని సంఘటనలు, అనానుకూల అంశాల వల్ల 2018-19లో ఆర్ధిక వృద్ధి పడిపోనుందని డిఅండ్‌బి లీడ్‌ ఎకనామిస్టు అరుణ్‌ సింగ్‌ విశ్లేషించారు. త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌ ఆర్ధిక వ్యవస్థకు కీలకం కానుందని పేర్కొన్నారు. ఎన్నికల ఏడాది కావడంతో జనరంజమైన బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు. గ్రామీణ, ఎంఎస్‌ఎంఇ రంగాలు, ఉపాధి కల్పనపై దృష్టి సారించే అవకాశం ఉందన్నారు. కార్మికులు, భూ చట్టాలకు ప్రోత్సాహాం ఇవ్వడం ద్వారా వ్యవస్థకు మద్దతు లభించే అవకాశం ఉందన్నారు. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడం, చమురు ధరలు పెరగడం వల్ల వాణిజ్య లోటు పెరుగుతుందని డిఅండ్‌బి ఆందోళన వ్యక్తం చేసింది. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో స్వల్ప కాలంలో దేశీయ కరెన్సీ ఒత్తిడికి గురి కావచ్చని పేర్కొంది. అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తే.. రూపాయికి మద్దతు లభించవచ్చని తెలిపింది. ప్రస్తుత ఏడాది జనవరిలో అమెరికా డాలర్‌తో రూపాయి విలువ 70.6-70.8 మధ్య కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos