కోల్కత్తా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పందించారు. ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడుతున్నారో వారే సమాధానం చెప్పాలని నితీష్ వ్యాఖ్యానించారు. సీబీఐ, ప్రభుత్వం ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలని ఆయన తెలిపారు. ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను ప్రకటించే లోపు దేశంలో ఏదైనా జరగొచ్చని బీహార్ సీఎం నితీష్ వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి, సీబీఐకి మధ్య నెలకొన్న వివాదంపై జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ముఫ్తీ కూడా స్పందించారు. రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తించాల్సిన సీబీఐ లాంటి సంస్థలు దుర్వినియోగం అవడం దురదృష్టకరమని ఆమె వ్యాఖ్యానించారు. మమతాబెనర్జీకి ఈ విషయంలో మద్దతు తెలుపుతున్నట్లు ముఫ్తీ ప్రకటించారు. సీబీఐ లాంటి సంస్థలు ఇలా దుర్వినియోగానికి గురైతే ఫెడరల్ స్పూర్తి దెబ్బతినే అవకాశముందని ముఫ్తీ తెలిపారు.