భారత్‌లో అవినీతి తగ్గుతోంది..!

భారత్‌లో అవినీతి తగ్గుతోంది..!

భారతదేశంలో వేళ్లూనుకుపోయిన అవినీతి తగ్గుముఖం పడుతోందని 2018 ప్రపంచ అవినీతి సూచి వెల్లడించింది.మన పొరుగు దేశాలైన చైనా, పాకిస్తాన్‌ కంటే మన దేశంలో అవినీతి చాలా తక్కువగా ఉందని ప్రపంచ దేశాల అవినీతిపై అధ్యయనం చేసే ‘ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌’సంస్థ తన వార్షిక నివేదికలో తెలిపింది. మొత్తం 180 దేశాల్లో అవినీతి అతి తక్కువ ఉన్న దేశాల్లో భారత్‌ 78వ స్థానంలో నిలిచింది. ఇక చైనా 87వ స్థానంలో ఉంటే, పాకిస్తాన్‌ 117వ స్థానంలో ఉందని ఆ అధ్యయనంలో తేలింది. ‘ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌’ఏటా కరప్షన్‌ పెర్‌సెప్షన్‌ ఇండెక్స్‌ (సీపీఐ)ను విడుదల చేస్తూ ఉంటుంది. ఇందులో అవినీతి స్కేల్‌ని జీరో నుంచి 100 వరకు కొలుస్తూ ఉంటారు. జీరో వస్తే అవినీతి బలంగా వేళ్లూనుకుందని అర్థం. అదే 100 పాయింట్లు వస్తే అవినీతి రహిత దేశంగా పేర్కొంటారు. ఈ ఏడాది సీపీఐలో మూడింట రెండు వంతుల దేశాల స్కోర్‌ 50 కంటే తక్కువగానే వచ్చాయి. 2017లో భారత్‌ సీపీఐ స్కోర్‌ 40 ఉంటే, ఈ ఏడాది 41కి చేరింది. భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అవినీతిలో ఆ మాత్రం తగ్గుదల కనిపించడం మంచి పరిణామమేనని ఆ నివేదిక అభిప్రాయపడింది.    

అన్నాహజారే నేతృత్వంలో ఉద్యమ ప్రభావంతో… 
2011లో అవినీతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా యువత ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే నేతృత్వంలో కదం తొక్కింది. జన లోక్‌పాల్‌ చట్టాన్ని తీసుకువచ్చి అవినీతిని అంతం చేయాలంటూ డిమాండ్లు మిన్నంటాయి.దీనిపై ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోయినప్పటికీ, క్షేత్రస్థాయిలో అవినీతిని అరికట్టడానికి ఎలాంటి ప్రత్యేకమైన చర్యల్ని తీసుకోకపోయినప్పటికీ ఆనాటి ఉద్యమ ప్రభావంతో అవినీతి కాస్తో కూస్తో తగ్గిందని ఆ నివేదిక అభిప్రాయపడింది.  

మొదటి ర్యాంకు డెన్మార్క్, అట్టడుగు స్థానంలో సోమాలియా 
ఇక అవినీతి అత్యంత తక్కువగా ఉన్న దేశాల్లో మొదటి స్థానంలో డెన్మార్క్‌ నిలవగా, రెండో స్థానంలో న్యూజిలాండ్‌ ఉంది. ఆ దేశాల సీపీఐ స్కోర్లు 88, 87గా ఉన్నాయి. ఇక అవినీతి ఊబిలో కూరుకుపోయిన దేశాల్లో సోమాలియా 10 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత సిరియా, దక్షిణ సూడాన్‌ చెరో 13 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాయి.  
అమెరికాలో కాస్త పెరిగిన అవినీతి 
ఇక అమెరికాలో గత ఏడాది కంటే సీపీఐ పాయింట్లు నాలుగు తగ్గి 75 నుంచి 71 కి పడిపోయాయి. దీంతో అమెరికా అవినీతి అతి తక్కువగా ఉన్న మొదటి 20 దేశాల జాబితాలో స్థానం పొందలేకపోయింది. 2011 తర్వాత మొదటి 20 దేశాల్లో చోటు దక్కకపోవడం అమెరికాకు ఇదే మొదటిసారి. ఈ పరిణామం కచ్చితంగా అగ్రదేశానికి ఆందోళన కలిగించేదే. సీపీఐ స్కోర్‌ నాలుగు పాయింట్లు దిగజారడం అంటే అత్యున్నత స్థాయిలో నైతిక విలువలు పడిపోతున్నాయనే ఆందోళన కలుగుతోందని ‘ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌’అమెరికా ప్రతినిధి జియో రాయటర్‌ అన్నారు. దేశంలో ఇదే స్థాయిలో అవినీతి కొనసాగితే దేశానికి అదే పెద్ద సమస్య అవుతుందని జియో పేర్కొన్నారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos