విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్‌లో భాజపాను దెబ్బ తీసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు , సినీ నటుడు పవన్ కల్యాణ్ కుట్ర పన్నారని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. శనివారం విజయవాడలో ఆయన మాధ్యమ ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు, పవన్ మధ్య అవగాహన కుదిరినట్లు అనుమానించారు. పుల్వామా దాడికి రాజకీయ రంగుల్ని పులమటం దురదృష్ట కరమన్నారు. పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన తప్పుడు వ్యాఖ్యలను చంద్రబాబు సమర్థించారని తప్పు బట్టారు. భారత్‌లోనూ పాకిస్తాన్ శ్రేయోభిలాషులు ఉన్నారని అవహేళన చేసారు. మాటల్ని మార్చటంలో తీసుకోవడంలో చంద్రబాబు అసాధ్యుడని, చంద్రబాబు వ్యాఖ్యలను పాకిస్తాన్ బాగా వాడుకుంటోందన్నారు. జాతీయ భద్రతా వ్యవహారాల్ని రాజకీయం చేయటం సరి కాదన్నారు. ‘ప్రపంచమంతా ప్రధాని మోదీ వైపే చూస్తోంది. తీవ్రవాద స్థావరాలపై మెరుపుదాడి చేసిన ఘనత మోదీదే. ఒక్క దాడితో పెద్ద సంఖ్యలో తీవ్ర వాదులను మట్టు బెట్టారు. దౌత్యపరంగా భారత్ ఎన్నో విజయాలు సాధించింది. వింగ్ కమాండర్ అభినందన్‌ను విడిచి పెట్టేలా మోదీ పాక్ మెడలు వంచారని’ పేర్కొన్నారు.