వరుసగా మూడో రోజూ సూచీలు సత్తా చాటాయి. బ్యాంకింగ్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడం కలిసొచ్చింది. బ్యాంకుల పనితీరుపై ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంతృప్తి వెలిబుచ్చడమే ఇందుకు కారణం. సానుకూల అంతర్జాతీయ పరిణామాలు కూడా లాభాలకు దోహదపడ్డాయి. కార్పొరేట్ కంపెనీ మూడో త్రైమాసిక ఫలితాల సీజన్ ప్రారంభం కానుండటం, అమెరికా- చైనాల మధ్య చర్చలతో మదుపర్లు కొంత అప్రమత్తంగా వ్యవహరించారు. అంతర్జాతీయంగా చూస్తే.. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా, ఐరోపా షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి.
సెన్సెక్స్ ఉదయం 35,964.62 పాయింట్ల వద్ద సానుకూలంగా ప్రారంభమైంది. బలహీన రూపాయి, ముడిచమురు ధరలు పెరగడంతో డీలాపడిన సూచీ.. రోజులో ఎక్కువ భాగం నష్టాల్లోనే కదలాడింది. అయితే ఆఖరి గంటన్నర ట్రేడింగ్‌లో పుంజుకున్న సెన్సెక్స్, ఇంట్రాడేలో 36,037.35 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 130.77 పాయింట్ల లాభంతో 35,980.93 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 30.35 పాయింట్లు పెరిగి 10,802.15 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 10,733.25- 10,818.45 పాయింట్ల మధ్య కదలాడింది.
బంధన్ బ్యాంక్ కుదేల్: విలీన ప్రతిపాదనల నేపథ్యంలో గృహ్ ఫైనాన్స్, బంధన్ బ్యాంక్ షేర్లు కుప్పకూలాయి. ఇంట్రాడేలో 17.35 శాతం పతనమైన గృహ్ ఫైనాన్స్ షేరు.. చివరకు 16.39 శాతం నష్టంతో రూ.256 వద్ద ముగిసింది. ఇక బంధన్ బ్యాంక్ షేరు సైతం ఒకానొకదశలో 6 శాతం పడి రూ.470.85 వద్ద కనిష్ఠానికి చేరింది. చివరకు 4.80 శాతం కోల్పోయి రూ.477.05 దగ్గర స్థిరపడింది.
* జేఎల్‌ఆర్ అమ్మకాలు దన్నుగా నిలవడంతో టాటా మోటార్స్ షేర్లు రాణించాయి. ఇంట్రాడేలో 2.99 శాతం పెరిగిన షేరు.. చివరకు 2.34 శాతం లాభంతో రూ.179.35 వద్ద ముగిసింది.
సెన్సెక్స్ 30 షేర్లలో 17 లాభాలతో ముగిశాయి. సన్‌ఫార్మా 3.98%, ఐసీఐసీఐ బ్యాంకు 3.46%, ఎస్‌బీఐ 3.18%, యెస్ బ్యాంక్ 2.86%, టాటా మోటార్స్ 2.34%, యాక్సిస్ బ్యాంక్ 2.11%, భారతీ ఎయిర్‌టెల్ 1.36%, బజాజ్ ఆటో 1.25%, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 1.24%, వేదాంతా 1.16% చొప్పున రాణించిన వాటిలో ఉన్నాయి. కోటక్ బ్యాంక్ 1.23%, ఎన్‌టీపీసీ 0.98%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 0.81%, హిందుస్థాన్ యునిలీవర్ 0.79%, బజాజ్ ఫైనాన్స్ 0.69% మేర నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో బ్యాంకింగ్ అత్యధికంగా 1.31% పెరిగింది. ఆరోగ్య సôరక్షణ, పీఎస్‌యూ, లోహ, వాహన, మౌలిక షేర్లు అదే బాటలో నడిచాయి. యంత్ర పరికరాలు, విద్యుత్, మన్నికైన వినిమయ వస్తువులు, ఐటీ స్క్రిప్‌లు డీలాపడ్డాయి. బీఎస్‌ఈలో 1,247 షేర్లు లాభాల్లో, 1328 షేర్లు నష్టాలతోనూ ముగిశాయి. 177 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.