న్యూఢిల్లీ: ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) మంగళవారం నుంచి మూడు రోజులపాటు భేటీ అవుతోంది. ఆర్‌బీఐ గవర్నర్‌గా డిసెంబరులో బాధ్యతలు స్వీకరించిన శక్తికాంత దాస్ అధ్యక్షతన తొలిసారిగా ఈ సమావేశం జరుగుతోంది. అయితే ఈ సమావేశంలోనూ ఎంపీసీ వడ్డీ రేట్ల తగ్గింపు జోలికి పోకపోవచ్చని భావిస్తున్నారు. డిసెంబరులో జరిగిన సమావేశంలోనూ, ఎంపీసీ కీలకమైన వడ్డీ రేట్ల జోలికి పోలేదు. అయితే రిటైల్ ద్రవ్యోల్బణం అదుపులో ఉంటే ఫిబ్రవరిలో జరిగే భేటీలో వడ్డీ రేట్ల తగ్గింపు విషయం పరిశీలిస్తామని ప్రకటించింది. డిసెంబరు 2018 నెల రిటైల్ ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్ఠ స్థాయి 2.19 శాతానికి దిగొచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరానికి (2018-19) ప్రభుత్వం నిరేశించిన లక్ష్యానికంటే ఇది చాలా తక్కువ. ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు శాతానికి రెండు శాతం అటు ఇటుగా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలని ప్రభుత్వం ఆర్‌బీఐకి నిర్దేశించింది. రిటైల్ ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్ఠ స్థాయికి దిగొచ్చినా ద్రవ్య లోటు భయాలు, పెరుగుతున్న ముడిచమురు ధరల నేపథ్యంలో గురువారం ప్రకటించే ద్రవ్య, పరపతి సమీక్షలో ఆర్‌బీఐ కీలకమైన రెపో వడ్డీ రేటు తగ్గింపు జోలికి పోకపోవచ్చని మార్కెట్‌వర్గాల అంచనా.9న ఆర్‌బీఐ బోర్డు సమావేశంలో గోయల్ ప్రసంగంఎంపీసీ సమావేశం ముగిసిన రెండు రోజులకే ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డు సమావేశం జరుగుతోంది. ఈ నెల 9న జరిగే ఈ సమావేశంలో కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ బోర్డు సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఏటా బడ్జెట్ సమర్పించాక కేంద్ర ఆర్థిక మంత్రి ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డు సభ్యులను ఉద్దేశించి ప్రసంగించడం సంప్రదాయం.