బుద్గాం: జమ్మూ కశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో భద్రతా బలగాలు ఇద్దరు తీవ్రవాదులను మట్టుబెట్టాయి. చారీ షరీఫ్‌లోని జిన్పాంచల్ వద్ద ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకున్నట్టు స్థానిక పోలీసులు వెల్లడించారు. ఇదే ప్రాంతంలో నక్కిన మరో తీవ్రవాదిని పట్టుకునేందుకు సైనికులు ఎన్కౌంటర్ కొనసాగిస్తున్నారు. రహదారులన్నీ దిగ్బంధించి గాలింపు చేపట్టారు. రాష్ట్రీయ రైఫిల్స్, బుద్గాం పోలీస్, సీఆర్పీఎఫ్ అధికారులు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. కాగా చారీ షరీఫ్ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో భద్రతా దళాలు ఇవాళ ఉదయం కార్డన్ సెర్చ్ ఆసరేషన్ ప్రారంభించినట్టు పోలీసులు వెల్లడించారు.. గాలింపు జరుపుతున్న సైనికులపై ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో ఎన్కౌంటర్ మొదలైనట్టు తెలిపారు.