న్యూఢిల్లీ: అవినీతిలో బీజేపీ, టీఎంసీ దొందూ దొందేనని సీపీఐ సీనియర్ నేత సీతారాం ఏచూరి విమర్శించారు. వరుస ట్వీట్లలో రెండు పార్టీల తీరును ఎండగట్టారు. బీజేపీ అవినీతి కేసుల చిట్టా చాలా పెద్దదని, జీఎస్పీసీఎల్ స్కామ్ నుంచి, వ్యాపం, సహారా-బిర్లా డెయిరీస్, రైస్, నీరవ్ మోదీ, మైనింగ్, లెక్కకుమించిన ఇతర కేసులు ఉన్నాయన్నారు. రాఫెల్ కేసులో అవినీతి అందరికీ తెలిసేందనని చురకలు వేశారు. జేపీసీ వేయడానికి వాళ్లు (బీజేపీ) నిరాకరించినప్పుడే రాఫెల్ స్కామ్‌లో వాళ్ల ప్రమేయం రుజువైందని ఆయన అన్నారు. అవినీతిపై పోరాటం చేస్తున్నట్టు చెప్పుకుంటున్న బీజేపీ… రాఫెల్ స్కామ్‌పై ఎందుకు దర్యాప్తునకు ఆదేశించడం లేదని సీతారాం ఏచూరి నిలదీశారు
.టీఎంసీ తక్కువేం కాదు..
.ప్రజలను లూటీ చేసిన తృణమూల్ కాంగ్రెస్ అగ్ర నాయకత్వంపై కూడా తప్పనిసరిగా విచారణ జరపాలని సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. పలువురు టీఎంసీ ఎంపీలు ఇప్పటికే అరెస్టులు, చార్జిషీట్లు ఎదుర్కొంటున్నారని అన్నారు. వారిపై విచారణకు బీజేపీ ఐదేళ్లు వేచిచూడడాన్ని కూడా ఆయన తప్పుపట్టారు.ఇది అవినీతి నేతలను తమ పార్టీలోకి రప్పించుకునే ప్రయత్నం కాదా అని బీజేపీని నిలదీశారు.చిట్ ఫండ్ స్కాములో సుప్రీంకోర్టు ఆదేశిచ్చినా ఐదేళ్ల పాటు బీజేపీ మిన్నకుందని, ఈ ఐదేళ్లలో కుంభకోణంలో ఉన్న పలువురు వ్యక్తులు బీజేపీవైపు మళ్లారని, దేశప్రజలను దోచుకోవడంలో బీజేపీ, టీఎంసీ ఎవరికి ఎవరూ తీసిపోరని ఏచూరి ఘాటు విమర్శలు చేశారు.
ఆ సొమ్ముల ఊసెత్తరేం?
విదేశాల నుంచి నల్లధనాన్ని రప్పించి ఒక్కో భారతీయుని ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తానని 2014 ఎన్నికల్లో వాగ్దానం చేసిన మోదీ ప్రజలను వెర్రివాళ్లను చేశారని ఏచూరి ఎద్దేవా చేసారు. ఇప్పుడు నల్లధనం వివరాలు బహిరంగంగా చెప్పడానికి కూడా ప్రధాని ఇష్టపడటం లేదన్నారు. దీనికి కారణం ఆ వివరాలను దాచిపెట్టి, పరిరక్షించి, నల్లధనాన్ని వాడుకోవాలని చూస్తుండటమేనంటూ ఆరోపించారు.