ఏపీలో పొలిటికల్ హీట్ అటు చంద్రబాబును, ఇటు వైఎస్ జగన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టుగా ఉంది. ఎన్నికలకు ఇంకా కనీసం మూడు నెలలకు పైనే సమయం ఉన్నా.. ఈ నేతలిద్దరూ ఇక పూర్తికాలాన్ని పార్టీ కార్యకలాపాలకే వాడుకునేలా ఉన్నారు. అందుకోసం వీరు విదేశీ యాత్రలను సైతం రద్దు చేసుకోవడం విశేషం.పాదయాత్రను ముగించుకున్న నేపథ్యంలో కూతురుని చూడటానికి జగన్ లండన్ వెళ్లే ప్లాన్ ఒకటి ఉండింది. ఈ మేరకు వార్తలు వచ్చాయి. పాదయాత్ర ప్రారంభించడానికి ముందు కూడా జగన్ లండన్ లో చదువుతున్న పెద్దకూతురు దగ్గరకు వెళ్లొచ్చారు. ఇప్పుడు మళ్లీ అక్కడకు వెళ్లాలని జగన్ అనుకున్నారట. అయితే జగన్ ముందు చాలా పనులున్నాయి. బస్సుయాత్ర ఒకటి ఉండనే ఉంది. యాభై నియోజకవర్గాల్లో ఆ యాత్రను చేపట్టనున్నారట. మరోవైపు అభ్యర్థుల ఎంపికా గట్రా పనులు ఉండనే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో లండన్ టూర్ ను జగన్ రద్దు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ కార్యకలాపాలకే మిగిలిన సమయాన్ని కేటాయించనున్నట్టుగా సమాచారం.ఇక దావోస్ పర్యటన విషయంలో కేంద్రంతో కొట్లాడాడు చంద్రబాబు నాయుడు. తన మందీ మార్భలాన్ని వేసుకుని దావోస్ వెళ్లాలని చంద్రబాబు అనుకున్నాడు. అయితే అంత మంది ఆ విదేశీ పర్యటనకు ఎందుకు? అన్ని రోజులు ఎందుకు? అని కొంచెం తగ్గించుకుమ్మని ఒక సూచన వచ్చింది. దానికి చంద్రబాబు ప్రభుత్వం గయ్యిమంది.తమ విదేశీ పర్యటనకు అడ్డంకి చెబుతారా.. అంటూ తాము అంతేమందిమి వెళ్తామని, అన్నేరోజులు పర్యటన చేస్తామని తేల్చిచెప్పింది చంద్రబాబు ప్రభుత్వం. దీంతో కేంద్రం వెనక్కు తగ్గింది. అయితే ఇప్పుడు చంద్రబాబు దావోస్ పర్యటనను రద్దు చేసుకున్నట్టుగా తెలుస్తోంది.లోకేష్ ఆధ్వర్యంలో మందీమార్భలం వెళ్తుంది కానీ.. చంద్రబాబు మాత్రం వెళ్లడంలేదట. ఈ పర్యటనను రద్దు చేసుకుని బాబు పార్టీ కార్యకలాపాలను చూసుకుంటారని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి రెండు పార్టీల అధినేతలూ విరామాలకు అస్సలు ప్రాధాన్యతను ఇచ్చేలా లేరు!