ముంబయి: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ సినిమా విడుదలకు పాకిస్థాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొన్ని కట్స్‌తో చిత్రాన్ని అక్కడ విడుదల చేసేందుకు పాక్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెన్సార్ (సీబీఎఫ్‌సీ) అనుమతి ఇచ్చింది. ఈ సినిమా పాక్‌లో జనవరి 18న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర సమర్పకుడు జయంతిలాల్ ఆనందం వ్యక్తం చేశారు. ‘మా పొలిటికల్ డ్రామా ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’కు పాకిస్థాన్‌లో గ్రీన్ సిగ్నల్ లభించడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రాన్ని అక్కడి ప్రజలు ఎంజాయ్ చేస్తారు. ఓ క్రికెటర్‌గా ఇమ్రాన్ ఖాన్ అంటే నాకు ఎప్పుడూ ఇష్టమే. ఇప్పుడు ఓ ప్రధానిగా ఆయన్ను అంతే గౌరవిస్తున్నా. అదేవిధంగా పాకిస్థాన్ సెన్సారు బోర్డుకు ధన్యవాదాలు’ అని ఆయన చెప్పారు. మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన వద్ద కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన సంజయ్ బారూ రాసిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ అనే బయోగ్రఫీ ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు విజయ్ రత్నాకర్ తెరకెక్కించారు. ఇందులో మన్మోహన్‌సింగ్‌గా అనుపమ్ ఖేర్ నటించారు. అక్షయ్ ఖన్నా, సుజానే బెర్నెట్, అర్జున్ మాథుర్, అహానా కుమ్రా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో సోనియా, రాహుల్ గాంధీని తప్పుగా చూపించారని, వాస్తవాల్ని వక్రీకరించారని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు. ఎట్టకేలకు జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించి స్థాయిలో విజయం సాధించలేకపోయింది.