బర్కత్‌పురలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించలేదనే కారణంతో ప్రేమోన్మాది నడిరోడ్డులో మధులిక అనే ఇంటర్ విద్యార్థినిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన మధులిక పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే మలక్‌పేట యశోద ఆస్పత్రికి తరలించారు. కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సత్యనగర్‌కు చెందిన మధులిక ఈరోజు ఉదయం కాలేజీకి వెళ్లేందుకు బస్టాప్‌కు రాగా భరత్ అనే 19ఏళ్ల యువకుడు ఆమెను అడ్డుకున్నాడు. కొద్దిసేపు ఆమెతో వాగ్వాదానికి దిగిన భరత్ ఆపై వెంట తెచ్చుకున్న కొబ్బరిబోండాల కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో మధులిక మెడ, చాతి భాగం, చేతి వేళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు మధులికను చికిత్స నిమిత్తం యశోదా ఆస్పత్రికి తరలించారు. భరత్…మధులిక ఇంటి సమీపంలోనే ఉంటున్నాడు. కొంతకాలంగా మధులికను ప్రేమిస్తున్నానంటూ వేధింపులకు గురిచేస్తున్నాడు. విషయాన్ని మధులిక ఆమె తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో వారం క్రితం భరత్‌పై మధులిక తల్లిదండ్రులు భరోసా సెంటర్‌లో ఫిర్యాదు చేశారు. భరత్‌ను పిలిపించిన షీ టీం అధికారులు అతడికి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ పద్దతి మార్చుకోని భరత్…మధులిక తల్లిని కూడా బెదిరించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం మధులికపై భరత్ కత్తితో దాడి చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రేమోన్మాది భరత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.