ఢిల్లీ : అందరూ అనుకుంటున్నట్లుగా తాను ప్రధాన మంత్రి పదవిని ఆశించటం లేదని కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం స్పష్టీకరించారు. ఇక్కడ జరిగిన ఇండియా టుడే పత్రిక శిఖరాగ్ర సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘ ప్రధాని నరేంద్ర మోదీ సమర్థ నాయకత్వంలో దేశం పురోగమిస్తోంది. నేను ప్రధాన మంత్రి పరుగు పందెంలో లేను. ఎన్నికల తర్వాత కూడా ఆయనే ప్రధాని. నేను సంఘపరివార్ మనిషిని. దేశానికి సేవయే నా కర్తవ్యం. మేమంతా ప్రధాని మోడీకి అండగా ఉంటాం. ఆయన లక్ష్యాన్ని నెరవేర్చేందుకు పని చేస్తున్నా. నేను ప్రధాని అయ్యే ప్రశ్న ఎక్కడ ఉత్పన్నమవుతుందని’ప్రశ్నించారు. తనను పని రాక్షసుడిగా అభివర్ణించుకున్న గడ్కరీ, తన దృష్టి ఎప్పుడూ పని పైనే ఉంటుందన్నారు. మురికి కూపంగా మారిన గంగానది వచ్చే ఏడాది-13 మాసాల్లో పరిశుద్ధ మవుతుందని ఆశించారు.