పౌరసత్వ బిల్లు అవసరం:మోదీ

పౌరసత్వ బిల్లు అవసరం:మోదీ

ఠాకూర్‌నగర్‌: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ భాజపా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం పశ్చిమ్‌బంగాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఠాకూర్‌నగర్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు.‘దీదీ(మమతాబెనర్జీని ఉద్దేశిస్తూ), ఆమె పార్టీ ఎందుకు హింసను ప్రేరేపిస్తున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. భాజపా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమను చూసి ఆమె ఆందోళన చెందుతున్నారు. మమతాబెనర్జీ ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు’ అని మోదీ దుయ్యబట్టారు.అనంతరం కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ బిల్లు గురించి మాట్లాడుతూ.. ‘పొరుగు దేశాల్లో ఉంటున్న హిందవులు, సిక్కులు, పార్శీలు, క్రైస్తవులు అక్కడ ఎన్నో బాధలు అనుభవించారు. ఎక్కడకు వెళ్లాలో తెలియక భారత్‌కు వచ్చారు. అలాంటి వారికి ఆపన్నహస్తం అందించేందుకు పౌరసత్వ బిల్లును తీసుకొచ్చాం. పార్లమెంట్‌లో ఈ బిల్లుకు మద్దతివ్వండి. ఇక్కడున్న నా సోదరసోదరీమణులకు(పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్న విదేశీయులను ఉద్దేశించి) ఈ బిల్లు ఎంతో అవసరం’ అని ప్రధాని మోదీ తృణమూల్‌ పార్టీని కోరారు.ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌ గురించి కూడా మోదీ ప్రస్తావించారు. ‘స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చాలా ఏళ్ల పాటు రైతులు, కార్మికులు, మధ్యతరగతి ప్రజలు నిర్లక్ష్యానికి గురయ్యారు. వారి సంక్షేమం కోసం బడ్జెట్‌లో చారిత్రక నిర్ణయాలు తీసుకున్నాం. ఇది ప్రారంభం మాత్రమే. లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో రైతులు, యువత కోసం అనేక పథకాలు తీసుకొస్తాం’ అని మోదీ చెప్పుకొచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos