న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ‘గరీబీ హఠావో’ తరహాలోనే దేశంలోని పేదలకు ‘కనీస ఆదాయ హామీ’ పథకాన్ని అమలు చేస్తామంటూ రాహుల్ గాంధీ ప్రకటించడంపై బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి విమర్శలు గుప్పించారు. ‘గరీబీ హఠావో’ మాదిరిగానే కనీస ఆదాయ పథకం కూడా బూటకకు వాగ్దానమేనా అని నిలదీశారు. నరేంద్ర మోదీ 2014లో అధికారంలోకి రావడానికి ముందు ఇచ్చిన ‘అచ్చేదిన్’ హామీతో రాహుల్ గాంధీ హామీని మాయావతి పోల్చారు. దేశ ప్రజల ఖాతాల్లో 15 లక్షలు చొప్పున వేస్తామని, అచ్చేదిన్ తెస్తామనీ ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీ బూటకమని తేలిపోయిందని, రాహుల్ హామీ కూడా ఇలాంటి కోవలోనిదేనని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లు రెండూ ఒకే నాణానికి రెండు ముఖాల్లాంటివని ఎద్దేవా చేశారు. కాగా, రాహుల్ సోమవారంనాడు రాయ్‌పూర్‌లో జరిగిన ‘కిసాన్ ఆధార్ సమ్మేళన్’లో మాట్లాడుతూ, తమ పార్టీకి 2019 ఎన్నికల్లో ప్రజలు పట్టం కడితే దేశంలోని పేదలందరికీ కనీస ఆదాయ హామీ పథకం అమలు చేస్తామని, ఈమేరకు కాంగ్రెస్ పార్టీ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఈ పథకం ద్వారా దేశంలో పేదలెవరూ ఆకలితో అలమటించరని చెప్పారు. ప్రపంచంలో ఏ ప్రభుత్వం ఇంతవరకూ ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని కూడా రాహుల్ ప్రకటించారు.