న్యూఢిల్లీ: రక్షణ శాఖ అభ్యంతరాలను పక్కనపెట్టి రాఫెల్ ఒప్పందంపై ఫ్రాన్స్‌తో జరిగిన చర్చల్లో ప్రధాన మంత్రి కార్యాలయం నేరుగా చర్చలు జరిపిందన్న వార్తలపై మాజీ కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోని తీవ్రంగా స్పందించారు. ఈ కాంట్రాక్ట్‌ను ముందుకు తీసుకెళ్లడానికి పీఎంఓకు ఏదైనా ప్రత్యేకమైన ఆసక్తి ఉందా అనే ప్రశ్నలకు ఈ పరిణామం తావిస్తోందన్నారు. ‘రక్షణ ఒప్పందాల బాధ్యత రక్షణ మంత్రిత్వ శాఖదే. దానిపై ప్రధానమంత్రి కార్యాలయం ఎందుకు ఆసక్తి చూపింది? ఎవరి ప్రయోజనాలను కాపాడుదలచుకుంది? పీఎంఓ ఏదో దాస్తోంది. ఈ ప్రశ్నలన్నింటికీ ప్రధాని సమాధానం ఇవ్వాలి’ అని మీడియాతో మాట్లాడుతూ అన్నారు. రాఫెల్ డీల్ వ్యవహారంలో అవకతవకలకు సంబంధించి సంయుక్త పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.