న్యూఢిల్లీ : విశ్వ హిందూ పరిషత్(విహెచ్‌పి) మాజీ నేత, అంతరాష్ట్రీయ హిందూ పరిషత్ అధినేత ప్రవీణ్ తొగాడియా శనివారం అధికారికంగా పార్టీ పేరు ప్రకటించనున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లలోని అన్ని స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు తొగాడియా వెల్లడించారు. తాను యుపిలోని అయోధ్య నుండి పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఎలక్షన్ కమిషన్‌లో రిజిస్టర్ చేయించిన ప్రకారం తొగాడియా నూతన పార్టీ పేరు ‘ హిందూస్థాన్ నిర్మాణ్ దళ్’ అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పోటీ చేస్తున్న రాష్ట్రాల్లో ఇప్పటికే 40 స్థానాల్లో అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఆర్డినెస్స్ పాస్ చేయాలన్న వాగ్దానంతో పోటీకి దిగనున్నామని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రామ జన్మభూమిపై నాలుగు నెలల పాటు ఎటువంటి నిరసనలు వ్యక్తం చేయమని విహెచ్‌పి ప్రకటించిన కొద్ది సమయానికే ఆయన ఈ ప్రకటన విడుదల చేశారు.