ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా పవన్‌కళ్యాణ్ తెలుగు సినిమాకి సంబంధించినంతవరకు మాంఛి ఫాలోయింగ్ వున్న నటుడు. బోల్డంత ఫ్యాన్ బేస్ కూడా వుంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినా, పవన్‌కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించినా.. అదంతా ఈ అభిమానుల బలం చూసుకునే. ప్రజారాజ్యం పార్టీ అంచనాల్ని అందుకోలేకపోయినా, చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు అయితే దక్కించుకుంది. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ తమ విజయావకాశాల్ని దెబ్బకొట్టిందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు గగ్గోలు పెట్టారు.
ఇప్పుడు జనసేన విషయానికొస్తే, ప్రజారాజ్యం పార్టీ స్థాయిలో కాకపోయినా, కాస్తో కూస్తో ఓటు బ్యాంకు అయితే సొంతం చేసుకునే అవకాశముంది. కానీ, జాతీయ సర్వేలు ఏవీ జనసేన పార్టీని పట్టించుకోవడంలేదు. పైగా జనసేన ఆంధ్రప్రదేశ్‌లో వామపక్షాలతో కలిసి హడావిడి చేయబోతోంది రానున్న ఎన్నికల్లో. ఆ లెక్కన చెప్పుకోదగ్గ స్థాయిలోనే జనసేనకు ఓటు బ్యాంకు వుండొచ్చు. అయినాగానీ, జనసేనను బీజేపీతోనో కాంగ్రెస్‌తోనో కూడా జాతీయ సర్వేలు పోల్చకపోవడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
ఇంతలా జనసేనను జాతీయ సర్వేలు ఎందుకు పట్టించుకోవడంలేదు.? ఇతరుల కోటాలో జనసేనను ఎందుకు పడేస్తున్నట్లు.? అంటే, దానికీ ఓ లెక్కుంది. అసలు జనసేన పార్టీ రానున్న ఎన్నికల్లో అన్నిచోట్లా పోటీ చేస్తుందా.? తెలుగుదేశం పార్టీ పొత్తుకు వెంపర్లాడుతున్న దరిమిలా జనసేనాని లొంగిపోతాడా.? ఇలా చాలా అనుమానాలున్నాయి. సో, జనసేనను ఇంకా పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా ఎవరూ గుర్తించడంలేదన్నమాట.
టీడీపీతో జనసేన పొత్తు ఖరారైతే, ఓ పది సీట్లలో కూడా జనసేన పోటీ చేసే అవకాశం వుండదు. అలాంటి పార్టీకి ఫలానా ఓటు బ్యాంకు వుందని ఎవరు మాత్రం అంచనా వేయగలరు.? ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇటీవలి కాలంలో జనసేనకు వెళ్ళినా, వారి ద్వారా జనసేన పార్టీకి ఒరిగేదేమీ లేదని తెలుగునాట రాజకీయ విశ్లేషణలు నిర్మొహమాటంగా తేల్చి చెబుతున్న దరిమిలా.. జనసేన ‘కస్సుబుస్సు’లాడితే కుదరదు.
2014 ఎన్నికల నుంచి ఇప్పటిదాకా జనసేన పార్టీ జనాన్ని ఆకట్టుకునేందుకు, జనానికి భరోసా కల్పించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేసింది.? అన్నదానిపై జనసేనాధిపతి పవన్‌కళ్యాణ్ ఆత్మవిమర్శ చేసుకోవాల్సి వుంది. ఆ ఆత్మ విమర్శ జరగకపోవడం వల్లే.. అత్యంత పకడ్బందీగా రాజకీయ కార్యాచరణ రచించుకోకపోవడం వల్లే.. జనసేన, ఆ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ రాజకీయ అంచనాలకు సంబంధించి ‘సోది’లో కూడా లేకుండా పోతున్నారు.