పాఠశాలల్లో సంస్కృత శ్లోకాలపై అభ్యంతరం.

న్యూఢిల్లీ : కేంద్రీయ విద్యాలయాల్లో విద్యార్థులు సంస్కృతం, హిందీ శ్లోకాలను పఠించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులను శాస్త్రీయంగా తీర్చిదిద్దవలసిన విద్యాలయాల్లో దేవుడిపై ఆధారపడే తత్త్వాన్ని పెంపొందిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై జబల్‌పూర్‌వాసి, న్యాయవాది వీణాయక్ షా దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు చేపట్టింది. జస్టిస్ రోహింటన్ ఎఫ్ నారిమన్ నేతృత్వంలోని ఇద్దరు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ రిట్‌పై విచారణ జరిపింది. ఇది చాలా కీలకాంశమని, దీనిపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరపాలని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ‘అసతోమా సద్గమయ’ అనే సంస్కృత శ్లోకాన్ని పాఠశాలల్లో ఉదయంపూట పఠించడమంటే అందరికీ మత బోధ చేస్తున్నట్లు కాదని తుషార్ సుప్రీంకోర్టుకు తెలిపారు. ఇది సార్వజనీన వాస్తవమని, అన్ని గ్రంథాలు, అన్ని మతాలు అంగీకరించినదేనని తెలిపారు. క్రైస్తవ పాఠశాలల్లో ‘ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ’ అని చెబుతారని, అది మతపరమైనదా? అని అడిగారు. దీనిపై జస్టిస్ నారిమన్ మాట్లాడుతూ అసతోమా సద్గమయ అనేది నేరుగా ఉపనిషత్తుల నుంచి వచ్చిందని చెప్పారు. దీనిపై తుషార్ స్పందిస్తూ సుప్రీంకోర్టు అధికారిక లోగోలో ‘యతో ధర్మస్తతోజయ’ అని ఉంటుందని, ధర్మం ఉన్న చోటే విజయం ఉంటుందని దీని అర్థమని తెలిపారు. దీనిలో మతపరమైన అంశం ఏదీ లేదన్నారు. అయితే ఈ వివాదాన్ని విస్తృత ధర్మాసనం విచారించవలసిందేనని జస్టిస్ నారిమన్ చెప్పారు. ఈ పిటిషన్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌కి నివేదించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos