పాక్‌ను శిక్షించండి

పాక్‌ను శిక్షించండి

అబుదాబి: పాక్‌  బెదరింపులకు
భయపడేది లేదని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ కుండ బద్ధలు కొట్టారు.
శుక్రవారం ఇక్కడ ఆరంభమైన రెండు రోజుల  ఇస్లామిక్ సహకార సంస్థ (ఓ‌ఐసీ)
సమావేశంలో  ముఖ్య అతిథిగా ప్రసంగించారు.‘భారత్‌కు అరబ్‌ దేశాలతో బలమైన
సంబంధాలున్నాయి.  తీవ్ర వాదానికి ఎలాంటి కుల, మతాలు ఉండవు.  ప్రపంచ
దేశాల ఎదుట పాక్‌ దోషిగా తేలింది. ఉగ్ర వాదం పై పాకిస్తాన్‌ కచ్చితంగా చర్యలు
తీసుకోవాలని’ డిమాండ్ చేశారు. ఉగ్రవాదం అమాయకుల్ని బలి తీసుకుంటోందని,
దేశాలను నాశనం చేస్తోందని అన్నారు. ‘శాంతి మార్గంలో భారత్‌ పయనిస్తోంది. అన్ని
మతాల ప్రజలు సోదర భావంతో ఎంతో సామరస్యంగా కలిసి మెలసి మనుగడ  సాగిస్తున్నారు.  ఇతర మతాల వారితోనూ ఎలా కలసి బతకాలో భారత్‌
ప్రజలకు తెలుసు. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ ఒకటిగా
నిలిచింది. భిన్నమైన దేశాల్లో భారత్‌ ఒకటి. ఉగ్రవాదం పెట్రేగిపోతోంది. దాన్ని
నిలువరించేందుకు అన్ని దేశాలు కృషి చేయాలని’ పిలుపు నిచ్చారు. ‘ఉగ్రవాదం వల్ల
పలు దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.  ఉగ్రవాదానికి వ్యతిరేకంగా
ఓఐసీ చేసే పోరాటానికి భారత్‌ మద్దతు ఇస్తుందని’ ప్రకటించారు.  ‘ఉగ్రవాదం అంతకంతకూ పెరుగుతోంది. ఉగ్రవాదులు చేస్తున్న
దారుణాల  దుష్పలితాల్ని  అందరమూ చూస్తున్నాం.  ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న  దేశాలు 
వెంటనే దానికి తమ మద్ధతును ఉపసంహరించు కోవాలి. మనందరం  కలిసి కట్టుగా
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలి. తీవ్రవాదం పేరుతో మతాన్ని వక్రీకరిస్తున్నారు.
మన పోరాటం ఉగ్రవాదానికి వ్యతిరేకంగానే తప్ప మతానికి వ్యతిరేకంగా కాదు. ఇస్లాం అంటేనే
 శాంతి. అల్లాకు ఉన్న 99 పేర్లలో ఏదీ
హింసను ప్రతి ఫలించదు. ప్రతి మతంలో శాంతి, కరుణ, సోదర భావం ఉన్నాయి. భారత్‌
ఎల్లప్పుడూ బహుళత్వాన్ని అనుసరిస్తుంది. రుగ్వేదం ప్రకారం దేవుడు ఒక్కడే కానీ
ఆయన్ను ప్రజలు రకరకాలుగా పూజిస్తారు’  అని 
పేర్కొన్నారు.‘మానవత్వాన్ని కాపాడాలనుకుంటే ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం, ఆర్థిక
సహాయం చేయడం నిలిపి వేయాలి. యుద్ధం, ఇంటెలిజెన్స్‌ ద్వారా ఉగ్రవాదంపై విజయాన్నిసాధించ
లేము’ అని పునరుద్ఘాటించారు. ‘మహాత్మాగాంధీ నడయాడిన ప్రదేశం నుంచి నేను ఇక్కడికి
వచ్చాను. అక్కడ ప్రతి ప్రార్థనా శాంతి అనే పదాన్ని ఉచ్ఛరించిన తర్వాతే
ముగుస్తుంది. స్థిరత్వం, శాంతి, సామరస్యం, ఆర్థిక పురోగతి, ప్రజల అభివృద్ధి కోసం
మీరు చేస్తున్న ప్రయత్నాలకు మా తరఫు నుంచి మీకు అభినందనలు’ అని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos