పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లెగసీని మేనల్లుడు సాయిధరమ్ ముందుకు నడిపిస్తున్నాడా? అంటే అవునేనే తాజా సన్నివేశం చెబుతోంది. పవన్ అంతటి వాడు కాకపోయినా.. ఆల్టర్నేట్ గా పవన్ నిర్మాతలకు మేనల్లుడు సాయిధరమ్ సాయపడుతున్నాడట. పవన్ రాజకీయాల్లోకి వెళ్లడంతో అప్పటికే అతడు ఇచ్చిన కమిట్ మెంట్లలో తాను నటిస్తూ నిర్మాతలకు సాయం అవుతున్నాడట. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న `చిత్రలహరి` చిత్రంలో నటిస్తున్నాడు. మైత్రి సంస్థకు పవన్ ఓ సినిమా చేయాల్సి ఉంది. పవన్ సిఫారసు మేరకే సాయిధరమ్ ఈ చిత్రంలో నటిస్తున్నాడన్న మాటా వినిపిస్తోంది. మరోవైపు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రఖ్యాత నిర్మాత ఏ.ఎం.రత్నం కు ఓ సినిమా చేయాల్సి ఉంది. బంగారం సినిమా తర్వాత ఇచ్చిన కమిట్ మెంట్ ఆ తర్వాత కుదరనేలేదు. కాటమరాయుడు పూర్తయ్యాక రత్నం బ్యానర్ లో ఓ సినిమాని ప్రారంభించినా అది పూర్తవ్వలేదు. ఆ క్రమంలోనే పవన్ అనూహ్యంగా రాజకీయాల్లోకి రావడం మధ్యలో త్రివిక్రమ్ తో అజ్ఞాతవాసి సినిమా చేయడం వగైరా సన్నివేశాల గురించి తెలిసిందే.అందుకే ఏ.ఎం.రత్నం బ్యానర్ లోనూ సాయిధరమ్ ఓ సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. రత్నం కోసం ఓ సినిమా చేయాల్సిందిగా మేనల్లుడికి పవన్ చెప్పారట. అయితే ఈ సినిమా గురించిన అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఇక ఏ.ఎం.రత్నం ఇప్పటికే సినిమాలు తగ్గించారు. గోపిచంద్ తో ఆక్సిజన్ చిత్రం చేసినా బాక్సాఫీస్ వద్ద అది తీవ్రంగా నిరాశపరిచింది. ఇకపోతే సాయిధరమ్ తేజ్ గత వైఫల్యాల నుంచి బయటపడి సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆ క్రమంలోనే తనని నమ్మిన నిర్మాతల కోసం ఎంతగానో శ్రమిస్తున్నాడట. పవన్ మామ కోసం ప్రస్తుతం కొన్ని కమిట్ మెంట్లను పూర్తి చేస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది.