పల్లి నూనె పేరుతో పల్టీ కొట్టించారు

  • In Crime
  • January 24, 2019
  • 959 Views
పల్లి నూనె పేరుతో పల్టీ కొట్టించారు

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మరో మోసం వెలుగు చూసింది. కరక్కాయ కథ మరువక ముందే పల్లీల నూనె పేరుతో రూ.కోట్లలో కాజేసిన వైనమిది. ‘‘ప్రతి నెలా రూ.5 వేలు చెల్లించండి.. 24 నెలల్లో ఏకంగా రూ.20 లక్షలు మీ సొంతం చేసుకోవచ్చు. మరో పథకంలో రూ.లక్ష డిపాజిట్‌ చేస్తే నెలకు రూ.10 వేలు సంపాదించుకోవచ్చు. రూ.2 లక్షలు డిపాజిట్‌ చేస్తే నెలకు రూ.20 వేల సంపాదన ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా పల్లీగింజల నుంచి నూనె తీయడమే. అందుకు కావాల్సిన యంత్రం, పల్లీలను కూడా మేమే ఇస్తాం. తీసిన నూనెను, దాని నుంచి వచ్చిన పిప్పిని సైతం కొంటాం’’ అని మాయమాటలతో నమ్మించారు. కొందరి వద్ద డబ్బు తీసుకొని యంత్రాలు ఇచ్చారు. ‘గ్రీన్‌గోల్డ్‌ బయోటెక్‌’ పేరుతో ప్రచారం చేయగా జనం రూ.కోట్లలో డిపాజిట్‌ చేశారు. చివరకు మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని ఉప్పల్‌ కేంద్రంగా ఈ మోసం జరిగింది. తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి 6 వేల మందికిపైగా బాధితులున్నారు. ఎక్కువగా కర్ణాటక, మహారాష్ట్ర నుంచే ఉన్నారు.

బాండు పేపర్లపై అగ్రిమెంట్లు..బహుమతులు
గ్రీన్‌గోల్డ్‌ బయోటెక్‌ కార్యాలయం హైదరాబాద్‌ ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉంది. ఏడాది క్రితం సికింద్రాబాద్‌లో ఉండేది. కార్యాలయానికి సమీపంలోనే గోదాము ఉంది. దానిలోనే పల్లీలు, నూనె, పిప్పి నిల్వ చేస్తున్నారు. నమ్మకం కలిగించేందుకు బాండు పేపర్ల మీద ఒప్పందాలను రాసి ఇస్తున్నారు. రూ.5 వేలు చెల్లించి ప్రాథమికంగా చేరి ఇతరులను చేర్పిస్తే బహుమతులు ఇస్తామని ప్రచారం చేశారు. ఎక్కువ సంఖ్యలో సభ్యులను చేర్చితే కార్లు బహుమతిగా ఇస్తామని నమ్మబలికారు. బ్యాంకాక్‌, ఇతర విదేశీ టూర్లు కూడా ఉంటాయని పేర్కొన్నారు. రూ.2 లక్షలు డిపాజిట్‌ చేయించిన కొందరికి రూ.5వేల చొప్పున నగదు ఇచ్చారు. పల్లీ గింజల నుంచి తీసిన నూనెకు లీటరుకు రూ.35, పిప్పికి రూ.20 చొప్పున చెల్లిస్తామని నమ్మించారు.

వెలుగులోకి వచ్చిందిలా..
రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌కు చెందిన ఇంద్రకిరణ్‌ (28) వ్యాపారి. అతని భార్య ఈ కంపెనీ గురించి తెలిసి సంస్థ ఎండీ జిన్నా శ్రీకాంత్‌ను, మేనేజర్‌ భాస్కర్‌యాదవ్‌ను కలవగా ఆమె నుంచి రూ.లక్ష తీసుకొని అగ్రిమెంట్‌ రాసి ఇచ్చారు. నెలకు ఇస్తామన్న డబ్బులు ఇవ్వకపోవడంతో ఇంద్రకిరణ్‌ బుధవారం ఉప్పల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు అక్కడి ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాంత్‌ పరారీలో ఉన్నట్లు ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన శ్రీకాంత్‌ గతంలోనూ పలు గొలుసుకట్టు దందాలు చేసి మోసం చేసినట్లుగా తెలిసింది. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో పలు స్టేషన్లలో కేసులు కూడా ఉన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos