పనిచేస్తున్న బంగారం దుకాణంలోనే చేతివాటం ప్రదర్శించాడో ఉద్యోగి. దాదాపు రెండు నుంచి అయిదు కిలోల బంగారం చోరీ చేశాడని దుకాణం యజమాని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. అరకిలో బంగారు ఆభరణాలనే చోరీ చేసి కుదవ పెట్టి డబ్బులు తీసుకున్నట్లు నిందితుడు పోలీసుల ముందు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు.. బంజారాహిల్స్ రోడ్ నం.12లోని రైసన్ పేరుతో బంగారు నగల దుకాణం ఉంది. ఇందులో దాదాపు అయిదు నెలలుగా మలక్‌పేటకు చెందిన వివేక్ గోడావత్ అలియాస్ వివేక్ జైన్ సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను గతంలో టూర్స్ అండ్ ట్రావెల్స్‌లో పనిచేయగా అక్కడ దాదాపు రూ.6లక్షల మేర మోసానికి పాల్పడ్డాడని తాజాగా నారాయణగూడ పోలీసులు మరికొందరితో కలిసి వివేక్ గోడావత్‌ను అరెస్ట్ చేశారు. దీంతో అనుమానం వచ్చిన రైసన్ దుకాణ యజమానులు అతని వ్యవహారశైలికి సంబంధించి వివరాలపై ఆరా తీశారు. రైసన్ దుకాణంలో చేసే ఆభరణాలను వివిధ బంగారు దుకాణాలకు అప్పగించే బాధ్యత వివేక్‌పై ఉండేది. ఈ నేపథ్యంలోనే వివేక్ పనిచేసిన కాలంలో ఆయా ఆభరణాల డెలివరీకి సంబంధించి యజమాని అనూప్ కుమార్ దృష్టి సారించారు. కాగా ఫిలింనగర్‌లోని ఆభరణం బంగారు నగల దుకాణానికి, సికింద్రాబాద్‌లోని ప్రేమ్‌రాజ్ శాంతిలాల్ బంగారు నగల దుకాణానికి ఇవ్వాల్సిన బంగారు ఆభరణాలు ఇవ్వలేదని తేలింది. మొత్తం లెక్కలు చూడగా దాదాపు 2 నుంచి 5 కిలోల బంగారం లెక్కల్లో తేడా వచ్చింది. దీంతో అనూప్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఇప్పటికే వివేక్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దాదాపు అరకిలో బంగారు ఆభరణాలనే తీసుకొన్నట్లు నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. ఆయా ఆభరణాలను మణప్పురంలో కుదవ పెట్టి దాదాపు రూ.12లక్షల మేర తీసుకున్నట్లు అంగీకరించాడు. ఈ విషయమై ఇన్‌స్పెక్టర్ గోవిందరెడ్డి మాట్లాడుతూ కేసును విచారిస్తున్నామని, పూర్తి వివరాలు రెండు, మూడు రోజుల్లో వెల్లడవుతాయన్నారు.
డ్రైవరుకు ఏడాది జైలు
రంగారెడ్డి జిల్లా కోర్టులు: ప్రైవేటు పాఠశాల బస్సును అజాగ్రత్తగా నడిపి రోడ్డు ఊడుస్తున్న కార్మికురాలిని ఢీకొట్టి.. ఆమె మృతికి కారణమైన డ్రైవర్‌కు న్యాయస్థానం ఏడాది కఠిన కారాగార శిక్ష, రూ.1,000 జరిమానా విధించింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం బాలాపూర్ మండలం పహడీషరీఫ్ గ్రామానికి చెందిన సీహెచ్. శకుంతల జల్‌పల్లి మున్సిపాలిటీలో స్వీపర్. 2016 డిసెంబరు 3న పహడీషరీఫ్ కూడలి వద్ద రోడ్డు ఊడుస్తుండగా ఓ పాఠశాల బస్సు వేగంగా వచ్చి శకుంతలను ఢీకొట్టింది. తీవ్రగాయాల పాలైన శకుంతల అక్కడిక్కడే మృతిచెందింది. బస్సు డ్రైవరైన మహేశ్వరం మండలం మంఖాలకు చెందిన కప్పాల దినకర్‌పై పోలీసులు కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. విచారించిన సైబరాబాద్ 14వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ క్షమా దేశ్‌పాండే సోమవారం తీర్పునిచ్చారు.