నెరవేరని మీ కలలను పిల్లల మీద రుద్దకండి : ప్రధాని మోదీ

నెరవేరని మీ కలలను పిల్లల మీద రుద్దకండి : ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: విద్యార్థుల తల్లిదండ్రులు ‘‘నెరవేరని తమ కలలను’’ పిల్లల ద్వారా నెరవేర్చుకునేందుకు ప్రయత్నించవద్దని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విజ్ఞప్తి చేశారు. మరో రెండు నెలల్లో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఇవాళ ‘పరీక్షా పే చర్చ 2.0’ కార్యక్రమం జరిగింది. ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్ధులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రధాని ముచ్చటించారు. ‘‘తల్లిదండ్రులకు నేను చేసే విజ్ఞప్తి ఏమంటే… మీరు నెరవేర్చుకోలేకపోయిన మీ కలలను మీ పిల్లలు నిజం చేస్తారని ఆశించకండి. ప్రతి పిల్లాడికీ తన సొంత సామర్థ్యం, బలాలు ఉంటాయి. ప్రతి పిల్లాడిలోని ఈ సానుకూలాంశాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం..’’ అని ప్రధాని పేర్కొన్నారు.  కాగా చదువుల్లో టెక్నాలజీ కారణంగా ఎదురవుతున్న ప్రతికూల ప్రభావంపై ఓ తల్లి అడిగిన ప్రశ్నకు ప్రధాని స్పందిస్తూ… టెక్నాలజీ అనేది విద్యార్థుల మేథో వికాసానికి తోడ్పడాలని పేర్కొన్నారు. ‘‘విద్యార్థులకు టెక్నాలజీ తెలియడం మంచిదికాదని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. విద్యార్థులకు నూతన సాంకేతిక పరిజ్ఞానం తెలియడం మంచిదే. టెక్నాలజీ అనేది విద్యార్ధుల మేధస్సు విస్తరించేలా ఉండాలి. వినూత్న ఆలోచింపజేయాలి…’’ అని పేర్కొన్నారు. పరీక్షల సందర్భంగా విద్యార్ధులు ఎదుర్కొంటున్న ఒత్తిడిపై మాట్లాడుతూ.. ‘‘జీవితంలో పరీక్షలు అనేవి చాలా ముఖ్యం. అయితే ఎవరూ వాటి గురించి ఆందోళన చెందకూడదు. ‘‘ఇప్పుడు కాకుంటే మరెప్పటికీ కాదు’’ అన్న ఒకే ఒక్క భావనతో ఉండకూడదు. కాబట్టి మిమ్మల్ని మీరే ఇలా ప్రశ్నించుకోండి. ‘‘ఇది మీ జీవితానికి సంబంధించిన పరీక్షా లేక కేవలం టెన్త్, ఇంటర్ వంటి గ్రేడ్ల కోసం రాస్తున్న పరీక్షా?’’ అని ప్రశ్నించుకోండి. ఒక్కసారి ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే మీలోని మానసిక ఒత్తిడి మొత్తం మాయమైపోతుంది..’’ అని ప్రధాని పేర్కొన్నారు. ‘‘సమాజం ఆశావహ దృక్పథంతో ఉండాలి కానీ ప్రతికూలంగా ఉండకూడదు. ఎవరైనా మనపై ఆశలు పెట్టుకున్నారంటే… మనపై వారికి నమ్మకం ఉందని అర్థం. కాబట్టి ఆ అంచనాల ఒత్తిడికి లొంగకుండా, మనలను మనమే సమర్థులుగా తయారవ్వాలి. దీన్ని సానుకూలంగా మలుచుకోవాలి…’’ అని ప్రధాని స్పష్టం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos