నిరసనలు కొనసాగించండి…

నిరసనలు కొనసాగించండి…

రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకునేందుకు నేటి(శుక్రవారం)నుంచి పదవ తేదీ వరకు నిరసనలు కొనసాగించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం నేతలు,కార్యకర్తలకు సూచించారు.ఎన్నికల ప్రణాళిక 2019లో భాగంగా శుక్రవారం నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడిన చంద్రబాబు నాయుడు నేతలకు సూచనలు చేసారు.ప్రత్యేక హోదా కోసం ఫిబ్రవరి 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జాతీయ పార్టీలతో కలసి ఢిల్లీలో ధర్మపోరాటం చేస్తామని అటుపై రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌కు వినతి పత్రం అందిస్తామన్నారు. కేంద్రం రాష్ట్రానికి న్యాయం చేస్తుందని ఆఖరి బడ్జెట్ వరకు ఎదురు చూశామని.. తమలో సహనం పూర్తిగా నశించిపోయిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్లమెంట్ చివరి సమావేశాలు కూడా ప్రారంభం అయ్యాయని.. 5ఏళ్లు ఎదురు చూసినా ప్రధాని మోదీ చేసిందేమీ లేదని మండిపడ్డారు. విశాల దృక్పథం గురించి మోదీ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసలు భాజపాకు విశాల దృక్పథం ఎక్కడుందని సీఎం ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌పై కక్ష సాధించడం విశాల దృక్పథమా అని నిలదీశారు. భాజపాయేతర పార్టీలే లక్ష్యంగా వేధింపులు జరుపుతున్నారని ధ్వజమెత్తారు. అందులో భాగంగానే తాజాగా యూపీలో అఖిలేశ్‌యాదవ్‌, మాయావతిపై ఐటీ దాడులు చేశారన్నారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని నేతలకు సూచించారు. కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరికీ పార్టీలో తగిన గుర్తింపు ఇస్తామని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో, సమైక్యాంధ్ర ఆందోళనల్లో పాల్గొన్నవారిపై కేసులు ఎత్తివేశామని గుర్తుచేశారు. రాష్ట్ర హక్కుల కోసం పోరాడేవారికి అండగా ఉంటామని పునరుద్ఘాటించారు. ఈ రోజు శాంతియుతంగా నిరసనలు తెలపాలని చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు.అగ్రిగోల్డ్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చెప్పారు. హైకోర్టులో రూ.250 కోట్లు డిపాజిట్ చేసి బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని చెప్పారు. అగ్రిగోల్డ్ వైఎస్ హయాంలో జరిగిన కుంభకోణమన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్‌ నిందితులను అరెస్ట్ చేశామని.. అగ్రిగోల్డ్ ను ప్రోత్సహించిన వారే తెదేపాపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos