‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు..’ అంటూ ఈ మధ్యనే వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సోదరి షర్మిల, తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారు తన మీద సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారానికి కారణమైనవారిని నిందించాలని కోరుతూ.! ప్రస్తుతం షర్మిల ఫిర్యాదు నేపథ్యంలో తెలంగాణ పోలీసులు నిందితుల్ని పట్టుకునే పనిలో బిజీగా వున్నారు. ఇప్పటికే పలువురికి నోటీసులు పంపారు, కొందర్ని విచారించారు కూడా.తాజాగా ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు, క్రైస్తవ మత ప్రచారకుడు కెఎ.పాల్ కూడా తెలంగాణ పోలీసుల్నే ఆశ్రయించారు. తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందన్నది ఆయన ఆరోపణ. పైగా, తనకు ప్రాణహాని వుందని కెఎ.పాల్ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారట. అన్నట్టు పాల్ గారికి ప్రాణహాని వున్నది చంద్రబాబు వైపునుంచే కాదు, వైఎస్ జగన్ వైపునుంచి కూడానట. చూస్తోంటే, ఇదేదో ‘పబ్లిసిటీ స్టంట్’ అన్పించకమానదు.గత కొద్ది రోజులుగా మీడియాలో కెఎ.పాల్ పేరు మార్మోగిపోతోంది. 2014 ఎన్నికలకు ముందు కూడా కెఎ.పాల్ హంగామా ఇలాగే జరిగింది. ఆ మాటకొస్తే, ఆయనకి అదొక సరదా. ట్రంప్ తెలుసంటాడు, మోడీతో పరిచయాలున్నాయంటాడు, అమిత్ షా తనకు భక్తుడని చెబుతుంటాడు. అంతెందుకు, రామ్‌గోపాల్ వర్మ తన కాళ్ళు పట్టుకున్నాడంటూ తాజాగా కెఎ.పాల్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతున్న విషయం విదితమే.ఒకప్పుడు కెఎ.పాల్ వేరు, ఇప్పుడు కెఎ.పాల్ వేరు. ఒకప్పుడు కెఎ.పాల్ అంటే, ఆయన కోసం ప్రముఖులు క్యూ కట్టేవారు. క్రైస్తవమత ప్రచారకుడిగా ఆయనకి అప్పట్లో వున్న పేరు ప్రఖ్యాతులు అలాంటివి. సోదరుడి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొనాల్సి వచ్చాక ‘పాల్’ ఇమేజ్ పాతాళానికి పడిపోయింది. ఇదిగో, ఇప్పుడు మళ్ళీ ఇలా మీడియాకెక్కి నానా యాగీ చేస్తున్నాడాయన.సోషల్ మీడియాలో బూతుల ప్రవాహం, ట్రాలింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒకరుకాదు, ఇద్దరుకాదు.. పదిమంది కాదు, పాతికమంది కాదు. వందల్లో, వేలల్లో, లక్షల్లో పనీపాటా లేని నెటిజన్లున్నారు. వీళ్ళకి ఒకటే పని, ట్రాలింగ్ చేయడం.. జుగుప్సాకరమైన కామెంట్స్ పోస్ట్ చేయడం. అందర్నీ అరెస్ట్ చేయడమంటే జరిగే పనేనా.?తెలంగాణ పోలీసులు ఈ కేసుల్ని సీరియస్‌గా తీసుకోవడాన్ని తప్పుపట్టలేంగానీ, ఈ కేసుల పుణ్యమా అని వారి సమర్థత అభాసుపాలయ్యే ప్రమాదం లేకపోలేదు.. అంతటి భారమైన కేసులివి. సోషల్ మీడియా కేటుగాళ్ళకి శిక్షపడి తీరాల్సిందే.కానీ షర్మిల, పాల్ బాటలో ఇంకెంతమంది ఇలా పోలీసులకు ఫిర్యాదులు చేయబోతున్నారో.. తద్వారా పేరుకుపోయే కేసుల్ని పోలీసులు ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాల్సిందే.