పాట్నా: బీహార్ వసతి గృహాల్లో బాలికలపై అత్యాచారం కేసులో ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ని విచారించాలని ‘పోస్కో’ప్రత్యేక కోర్టు సీబీఐని ఆదేశించింది. ముజఫర్ నగర్ జిల్లా మేజిస్ట్రేట్ ధర్మేంద్ర సింగ్, సాంఘిక సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి అతుల్ ప్రసాద్ పైనా విచారణకు ఆదేశాలిచ్చింది. నిందితుడైన నకిలీ వైద్యుడు అశ్విన్ వేసిన పిటిషన్‌పై పాట్నాలోని పోస్కో కోర్టు తాజా ఆదేశాలిచ్చింది. విచారణలో వాస్తవాలను సీబీఐ నీరుగారుస్తోందని, పై ముగ్గురిపై దర్యాప్తునకు ఆదేశిస్తే వారి ప్రమేయంపై వాస్తవాలు వెలుగుచూస్తాయని అశ్విన్ పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో నితీష్, ధర్మేంద్ర సింగ్, అతుల్ ప్రసాద్‌లపై విచారణ జరపాలంటూ సీబీఐని పోస్కో న్యాయమూర్తి మనోజ్ కుమార్ ఆదేశించారు. బీహార్‌లోని వసతి గృహాలకు సంబంధించిన వివరాలను నితీష్ కుమార్ ప్రభుత్వం అందించడం లేదని గతంలో సుప్రీంకోర్టు ఆగ్రహించింది. ఈ కేసును న్యూఢిల్లీలోని పోస్కా కోర్టుకు ఈ నెల 7న బదిలీ చేసింది. రెండు వారాల్లోగా ఈ కేసులను బీహార్ సీబీఐ కోర్టు నుంచి పోస్కా సాకేత్ కోర్టుకు బదిలీ చేయాలని ఆదేశించింది. ఆరు నెలల్లోగా సాకేత్ కోర్టు విచారణను ముగించాలని కూడా అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. లైంగిక దాడి కేసులో దర్యాప్తు జరుపుతున్న అధికారిని బదిలీ చేయడంపై కూడా సీబీఐని కోర్టు మందలించింది. దీనిపై వివరణ ఇస్తూ అఫిడవిట్ సమర్పించాలని కూడా దర్యాప్తు సంస్థను సీజేఐ రంజన్ గొగోయ్‌తో కూడిన ధర్మాసనం ఆదేశించింది.