జైపూర్: అక్రమ ఆస్తుల కొనుగోలు కేసులో నిందితుడు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా మరో కేసులో విచారణ కోసం మంగళవారం జైపూర్ చేరుకున్నారు. వాద్రాతో పాటు ఆయన తల్లి మౌరీన్ వాద్రాను విచారణకు హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ .ఆదేశించింది.వృధ్దురాలైన తన తల్లిని వేధించాల్సిన అవసరం ఏముందంటూ రాబర్ట్ వాద్రా ఫేస్‌బుక్ వేదికగా విరుచుకుపడ్డారు. నాలుగున్నరేళ్లుగా గుర్తుకురాని అవినీతి.. ఎన్నికల సమయంలోనే ఎందుకు లేవనెత్తుతున్నారని ప్రశ్నించారు. ‘‘. కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్న ఈ ప్రభుత్వం.. వయోభారంతో బాధపడుతున్న నా తల్లిని ఎందుకు వేధిస్తుందో అర్థం కావడం లేదు. రోడ్డు ప్రమాదంలో కుమార్తెను.. డయాబెటిస్‌తో భర్త, ఓ కుమారుడిని కోల్పోయి బాధపడుతున్న నా తల్లికి తోడుగా ఉండడం కోసం నాతో పాటు ఆఫీసుకు రమ్మన్నాను. దీని ద్వారా తనకు కొంత ఊరట లభిస్తుందని ఆశించాను. నాతో ఆఫీసులో ఉన్నందుకుగానూ ఇప్పుడు ఆమెపై కూడా నేరాలు మోపి విచారిస్తున్నారు. ఇప్పటికే నన్ను మూడు రోజుల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఏదైనా చట్ట విరుద్ధంగా జరిగిందని మీరు భావిస్తే ఈ నాలుగేళ్ల ఎనిమిది నెలల పాలనలో కాకుండా.. సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి కేవలం ఒక నెల ముందు ఎందుకు విచారిస్తున్నారు. ఎన్నికల జిమ్మిక్కుగా ప్రజలు దీన్ని అర్థం చేసుకోరని మీరు భావిస్తున్నారా? నేను ఎప్పుడూ నిబంధనలకు కట్టుబడే ప్రవర్తించాను. దేవుడు మాతో ఉన్నాడు. ఎంతటి విచారణనైనా ఎదుర్కొంటాను. అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తాను’’ అన్నారు.. లండన్ ఆస్తుల కొనుగోలులో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన దిల్లీలో ఇప్పటికే మూడుసార్లు ఈడీ ఎదుట హాజరయ్యారు.