కోల్‌కతా: ప్రభుత్వ సంస్థలను రాష్ట్ర ప్రభుత్వాలపై ఉసిగొలుపుతూ ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్న కేంద్ర ప్రభుత్వ వేధింపులకు వ్యతిరేకంగా మడం తిప్పని పోరాటం కొనసాగిస్తామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. తమ పోరాటం ప్రభుత్వంపైనే కానీ, సీబీఐ కాదన్నారు. కేంద్ర సంస్థల బాధితురాలిగా రాష్ట్రం మారుతోందంటూ మండిపడ్డారు. కోల్‌కతాలో ‘రాజ్యాంగ పరిరక్షణ’ పేరుతో ధర్నా సాగిస్తున్న మమతా బెనర్జీ…అదే వేదిక నుంచి కేంద్ర సర్కార్‌పై నిప్పులు చెరిగారు. ధర్నా వేదక నుంచే ప్రభుత్వాన్ని నడుపుతామని మమత చెప్పారు. తమ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు అన్ని ప్రభుత్వ సంస్థలను కేంద్రం ఉసి గొలుపుతూ ప్రజాస్వామ్యాన్ని కళంకిత చేస్తోందన్నారు. ప్రజలను భయపట్టేందుకు కేంద్రం ప్రయత్నాలు సాగిస్తోందన్నారు. ధర్నా వేదిక నుంచి కదలేది లేదని తెగేసి చెప్పారు. ఇక్కడి నుంచే పాలన సాగిస్తామని తెలిపారు.
8 వరకు దీదీ దీక్ష
కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈనెల 8వ తేదీ వరకు దీక్ష చేపట్టనున్నారు. తాను చేపట్టిన సత్యాగ్రహం .. సీబీఐకి వ్యతిరేకం కాదు అని, మోదీ ప్రభుత్వ అకృత్యాలకు వ్యతిరేకంగా తాను దీక్షలో కూర్చున్నట్లు దీదీ చెప్పారు. కోల్‌కతా పోలీసు చీఫ్ రాజీవ్ కుమార్‌ను విచారించేందుకు సీబీఐ అధికారులు రావడంతో మమతా బెనర్జీ కేంద్రంపై తిరుగుబాటుకు దిగారు. ఆదివారం రాత్రి నుంచి ఆమె దీక్షలో కూర్చున్నారు. తాను చేస్తున్న దీక్ష.. రాజకీయానికి సంబంధం లేదని చెప్పారు. వేదికపై సేవ్ ఇండియా అని మాత్రమే ఉందని, తమ పార్టీ పేరు లేదన్నారు. అయితే బెంగాల్‌లో ఈనెల 12వ తేదీ నుంచి టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. ఆ పరీక్షలకు 4 రోజుల ముందు నుంచి ఎటువంటి మైక్‌లు మోగరాదు. ఆ కారణంగా దీదీ తన దీక్షను ఈనెల 8వ తేదీ వరకు చేపట్టనున్నారు. దీదీ దీక్షకు వివిధ రాష్ట్రాల నేతలు మద్దతు తెలుపుతున్నారు. కనిమొళి, తేజస్వి యాదవ్‌లు ఆమెను దీక్షాస్థలం వద్ద కలుసుకోనున్నారు.