ద్విచక్ర వాహనాలపై 18% జీఎస్‌టీ——టీవీఎస్‌ మోటార్‌ ఛైర్మన్‌ డిమాండ్‌

  • In Money
  • January 9, 2019
  • 1008 Views

దిల్లీ: ద్విచక్ర వాహనాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)ను తగ్గించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. అత్యధికులకు కనీస అవసరంగా మారిన ద్విచక్ర వాహనాలపై జీఎస్‌టీని 18 శాతానికి తగ్గిస్తే అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందని గత వారం హీరో మోటోకార్ప్‌ ఛైర్మన్‌ పవన్‌ ముంజాల్‌ అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. తాజాగా టీవీఎస్‌ మోటార్‌ ఛైర్మన్‌ వేణు శ్రీనివాసన్‌ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ప్రస్తుతం ద్విచక్ర వాహనాలపై 28 శాతం జీఎస్‌టీ విధిస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కువ మంది ప్రజలకు ద్విచక్రవాహనం ప్రాథమిక అవసరంగా మారినందున, వీటిపై విధించే జీఎస్‌టీ రేట్లను పునఃసమీక్షించాలని శ్రీనివాసన్‌ కోరారు. పట్టణీకరణ అధికమవ్వడం, ప్రజల కొనుగోలు శక్తి పెరగడం, చిన్న పట్టణాల మధ్య అనుసంధానత ఏర్పడటం వల్ల ద్విచక్ర వాహనం ప్రతి ఒక్కరికి ప్రాథమిక అవసరంగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో విలాసవంత వస్తువులకు విధిస్తున్న 28 శాతం పన్ను శ్లాబులో ద్విచక్రవాహనాలను ఉంచడం సరైన నిర్ణయం కాదన్నారు. కొత్త భద్రతా ప్రమాణాలు, బీఎస్‌6 ఉద్గార నిబంధనలు అమలైతే ద్విచక్ర వాహనాల ధరలు మరింత పెరుగుతాయని చెప్పారు. జీఎస్‌టీ రేటు కూడా ఎక్కువగా ఉంటే అది కొనుగోలుదారుపై భారాన్ని పెంచుతుందని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos