శ్రీనగర్ : తీవ్రవాదుల చేతిలో హతుడైన జవాన్ తండ్రి బీజేపీ తీర్థం స్వీకరించారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి చెందిన ఆర్మీ జవాన్ ఔరంగజేబ్ ను పుల్వామా వద్ద కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు. తీవ్రవాదుల చేతిలో హత్యకు గురైన ఔరంగజేబ్ తండ్రి ముహమ్మద్ హనీఫ్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మాజీ లెఫ్టినెంట్ జనరల్ రాకేష్ కుమార్ శర్మల సమక్షంలో బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన హనీఫ్ కు ప్రధాని మోదీ అమరవీరుడైన ఔరంగజేబ్ చిత్రపటాన్ని అందించి పార్టీలోకి స్వాగతం పలికారు. జూన్ 14వతేదీన హత్యకు గురైన ఔరంగజేబ్ కు శౌర్యచక్ర అవార్డును ప్రకటించారు. పేద ప్రజల కోసం పనిచేస్తున్న బీజేపీలో చేరడం తనకు సంతోషాన్నిచ్చిందని హనీఫ్ చెప్పారు. గత పాలకుల కంటే మోదీ పాలన బాగుందని హనీఫ్ కితాబునిచ్చారు. బీజేపీలో చేరిన హనీఫ్ కు స్వాగతం చెప్పామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ రైనా చెప్పారు.