న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘ఓట్ ఆన్ అకౌంట్’కు బదులుగా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తలను ఆర్థిక మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్ తాత్కాలిక బడ్జెట్టేనని వివరణ ఇచ్చింది. బుధవారంనాడు మీడియాతో మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, 2019-20 సంవత్సరానికి తాత్కాలిక బడ్జెట్‌నే కేంద్రం ప్రవేశపెడుతుందని చెప్పారు. ఎన్నికల సంవత్సరంలో తాత్కాలిక బడ్జెట్ లేదా ఓట్ ఆన్ అకౌంట్‌ను ప్రవేశపెట్టడం సంప్రదాయంగా వస్తోంది. ఎన్నికల తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వమే పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంటుంది. ఆ ప్రకారం పరిమిత కాలానికి అవసరమైన ఖర్చులకు అప్రూవల్ తప్పనిసరి. సంప్రదాయం ప్రకారం, ప్రభుత్వం కొత్త సర్వీసులను కానీ, ఫైనాన్స్ బిల్లును తేవడం కానీ ఉండదు. ఈనెల ప్రారంభంలో వైద్యచికిత్స కోసం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అమెరికా వెళ్లడంతో గోయల్‌కు ఆర్థిక మంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలు ఇచ్చారు. దీంతో ఫిబ్రవరి 1న ఆయనే తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.