మామూలు మానవులెవరూ అర్థరాత్రి పూట శ్మశానంలోకి అడుగు పెట్టరు. మరి అలాంటిది అర్థరాత్రి పూట అడుగు పెట్టడమే కాదు.. సగం కాలిన శవాన్ని పీక్కుతింటున్నాడు ఈ నరమాంస భక్షకుడు. తమిళనాడు తిరునెవ్వేలి జిల్లా టి. రామనాథపురం గ్రామానికి చెందిన 70 ఏళ్ల మహిళ మరణించింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెకు గ్రామ శివారులోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.అనంతరం అక్కడినుంచి కుటుంబసభ్యులు ఇంటికి వెళ్లిపోయారు. అయితే అదే రోజు రాత్రి 1.30 గంటల సమయంలో కొందరు గ్రామస్థులు శ్మశాన మార్గం గుండా వెళుతున్నారు. వారికి ఏవో శబ్ధాలు వినిపించడంతో అక్కడే ఆగి గమనించారు. కొంత దూరంలో ఓ వ్యక్తి సగం కాలిన శవాన్ని పీక్కుతింటున్నట్లు గమనించి షాకయ్యారు. వెంటనే గ్రామంలోకి వెళ్లి మరికొందరిని పిలుచుకుని వచ్చారు. ఆ యువకుడిని వారించినా అక్కడినుంచి కదల్లేదు.దీంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తలాతోక లేని సమాధానాలు చెప్పడంతో యువకుడి మానసిక స్థితి సరిగాలేదని గుర్తించారు పోలీసులు. అతడికి సంబంధించిన బంధువులు ఎవరో కూడా చెప్పలేక పోతుండడంతో పోలీసులే స్వయంగా కిల్పాక్‌లోని మానసిక వైద్యాలయానికి తరలించారు.పోలీసుల విచారణలో అతడు టి. రామనాథపురానికి చెందిన మురుగేశన్ అని స్థానికులు చెబుతున్నారు. చెడు అలవాట్లకు బానిసైన అతడికి భార్యా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడు మారడంలేదని భార్య పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. దాంతో అతడిని పట్టించుకునేవారు లేక పిచ్చివాడిగా మారిపోయాడని పోలీసులకు గ్రామస్తులు తెలిపారు.