ఏపిలో ఎన్నికల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. అధికార పార్టీ ఇప్పటికే అభ్యర్దుల ఖరారు ప్రక్రియ ప్రారంభించింది. ప్రతి పక్ష వైసిపి అధినేత తన పాదయాత్రలో కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ఖరారు చేసారు. ఇక, కొత్తగా ఎన్నికల బరిలో కి దిగుతున్న జనసేన సైతం ఇప్పటికే తొలి జాబితాను సిద్దం చేసింది. ఈ జాబితా ప్రకటనకు ముహూర్తం సైతం ఖరారు చేసింది. దీంతో..జనసేన నుండి పోటీ చేయాలనుకుంటున్న ఆశావాహుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది.
అభ్యర్ధుల ప్రకటన ముహూర్తం ఖరారు..!
జనసేన అధినేత వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్ధుల ఖరారు పై దృష్టి సారించారు. ఇప్పటికే పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా కమిటీల ఏర్పాటు కు సంబంధించి నివేదికలు పవన్ కళ్యాన్ కు అందాయి. దీంతో..తొలుత కమిటీలను ప్రకటించి..వీలైనంత త్వరగా అభ్యర్ధులను ప్రకటించాలని పవన్ భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ నెల 26న రిపబ్లిక్ డే రోజున తమ పార్టీ తొలి జాబితా విడుదల చేసేందుకు పవన్ కళ్యాన్ ముహూర్తంగా నిర్ణయించారు. ఇప్పటికే పార్టీ నేతలతో ఆయన ఈ విషయాన్ని పంచుకున్నారు. తొలి సారి పోటీ చేస్తున్న పార్టీ అయినా..కొత్త వారితో పాటుగా ఇప్పటికే ఎమ్మెల్యేలుగా పని చేసిన వారు జనసేనలో చేరటంతో..వారికి కూడా తొలి లిస్టులోనే పేర్లను ఖరారు చేస్తారని తెలుస్తోంది. ముందుగానే అభ్యర్ధులను ఖరారు చేయటం ద్వారా చివరి నిమషంలో పోటీ లేకుండా..ప్రకటిం చిన అభ్యర్ధులు ప్రచారానికి వీలుగా పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
తొలి జాబితా లో వీరికే అవకాశం..!
2019 ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఈనెల 26వ తేదీన ప్రకటించాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ భావిస్తున్నారు. దీంతో..తొలి జాబితాలో తూర్పు గోదావరి తో పాటుగా గుంటూరు..శ్రీకాకుళం- అనంతపురం జిల్లాలకు చెందిన కొన్ని నియోజకవర్గాలు ఉండే అవకాశం ఉంది. జనసేన తొలి అభ్యర్ధిగా ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాలోని ముమ్మిడివరం నుంచి బీసీ వర్గానికి చెందిన పితాని బాలకృష్ణను ప్రకటించారు. ఇక రాజమహేంద్రవరం ఎంపీ అభ్య ర్థిగా ఆకుల సత్యనారాయణ పేరును ప్రకటించే అవకాశముంది. రాజమహేంద్రవరం రూరల్ నుంచి కందుల దుర్గేష్, తుని నుంచి రాజా అశోక్‌బాబు, మండపేట నుంచి దొమ్మేటి వెంకటేశ్వర్లు, కాకినాడ రూరల్ నుంచి అనిశెట్టి బుల్లె బ్బాయి, పి.గన్నవరం నుంచి పాముల రాజేశ్వరి, రాజోలు నుంచి రాపాక వరప్రసాద్ పేర్లలో కొన్నింటిని ప్రకటించే అవకాశముంది. వీలైతే మరి కొన్ని నియోజకవర్గాల అభ్యర్ధుల పేర్లు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇక, గుంటూరు జిల్లాలో తోట చంద్రశేఖర్, నాదెండ్ల మనోహర్ వంటి వారు పేర్లు తొలి లిస్టులో ఉండే ఛాన్స్ ఉంది. అనంతపురం నుం డి ఇప్పటి వరకు రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజా సేవలో ఉన్న ఇద్దరి పేర్ల పై పవన్ దృష్టి సారించినట్లు సమాచారం. వీరి పేర్లు తొలి జాబితాలో ఉండే అవకాశం కనిపిస్తోంది.
ఇతర పార్టీలకు ధీటుగా …
అధికారంలో ఉన్న టిడిపి..ప్రతిపక్ష లో ఉన్న వైసిపి ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల అభ్యర్దులను ప్రకటించాయి. ప్రతీ నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని అడుగులు వేస్తున్నాయి. ఇదే సమయంలో జన సేన సైతం ఇప్పటికే ఖరారు చేసిన అభ్యర్ధులను ప్రకటించి..వారిని ప్రచారంలోకి దింపాలని భావిస్తోంది. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన అభ్యర్ధులు తొలి జాబితా లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రజారాజ్యంలో ఎన్నికల ముందు అభ్యర్ధులను ప్రకటించటం ద్వారా..వారు పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లలేక కొన్ని ఇబ్బందులు ఎదు ర్కోవాల్సి వచ్చింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పవన్ కళ్యాన్ ఈ సారి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పొత్తు కోసం తన పై ఒత్తిడి వస్తున్న పరిస్థితుల్లో అభ్యర్ధుల ప్రకటన మొదలు పెడితే తాను ఎవరితో లేననే స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లవుతుందని జనసేనాని భావిస్తున్నారు. దీంతో..మిగిలిన రెండు ప్రధాన పార్టీల కంటే ముందుగా నే తమ తొలి జాబితా విడుదల చేసేందుకు పవన్ కళ్యాన్ సిద్దం అవుతున్నారు.