చురు:దేశ గౌరవ మర్యాదలను మంట గలిపే పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయబోనని ప్రధాని నరేంద్ర మోది భరోసా ఇచ్చారు. రాజస్థాన్‌లోని చురులో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో మాట్లాడారు. పాక్ సరిహద్దుల్లో మంగళవారం తెల్లవారు జామున వాయుసేన దళాలు జరిపిన మెరుపు దాడిని ప్రస్తావించారు. ‘దేశం అప్రమత్తంగానే ఉంది. భారతీయ పౌరులందరికీ విజయం కచ్చితంగా లభిస్తుంది. మెరుపు దాడి వీరులకు తలవంచి నమస్కారం చేద్దాం. ఈ దేశం సురక్షితమైన చేతుల్లో ఉందన్న విశ్వాసాన్ని అందిస్తున్నా. దేశానికి, జాతికి ఎన్నటికీ తలవంపులు తీసుకురాను. సగర్వంగా భారతావని తల ఎత్తుకునే ఉంటుంది. జాతి ప్రయాణం, విజయ యాత్ర కొనసాగుతూనే ఉంటుంది. జాతి నిర్మాణంలో భాగ స్వాములైన ప్రతి ఒక్కరికీ ప్రధాన సేవకుడిలా నమస్కరిస్తున్నాను. వ్యక్తి కంటే పార్టీ, పార్టీ కంటే దేశం గొప్పదనే భావనతో పనిచేస్తున్నాం ’’ అని మోదీ అన్నారు. పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత వాయుసేన పాకిస్థాన్ సరిహద్దుల్లోని బాలాకోట్, ముజప్ఫర్ నగర్ ప్రాంతాల్లోని జేషే మహ్మద్ ఉగ్రవాదుల శిబిరాలపై భారత వాయుసేన 21 నిమిషాల పాటు బాంబుల వర్షాన్నికురిపించారు. ఏడు ఎకరాల్లో విస్తరించిన బాలాకోట్ ఉగ్రవాద శిబిరం ధ్వంస మైందని తెలుస్తోంది. ఈ దాడికి భారత వాయుసేన పన్నెండు మిరాజ్ 2000 యుద్ధవిమానాల్ని వినియోగించాయి.