జయలలిత మెమోరియల్‌ నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌

జయలలిత మెమోరియల్‌ నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌

చెన్నై: మెరీనా బీచ్‌లో తమిళనాడు దివంతగ ముఖ్యమంత్రి జయలలిత మెమోరియల్‌ నిర్మాణం చేపట్టడానికి మద్రాస్‌ హైకోర్టు నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. ఆ స్మారక చిహ్నాన్ని నిర్మించకూడదంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాం(పిల్‌)ను న్యాయస్థానం కొట్టి వేసింది. ఆమె మృతి చెందిన కారణంగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమెను దోషిగా పేర్కొనడానికి వీల్లేదని పేర్కొంది. జస్టిస్‌ ఎం.సత్యనారాయణ, పి.రాజమాణిక్యంతో కూడిన ధర్మాసనం ఇందుకు సంబంధించిన ఆదేశాలను జారీ చేసింది. ప్రజలను దృష్టిలో పెట్టుకుని విధానపరమైన నిర్ణయాలను తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. కొద్ది కాలంగా ఇందుకు సంబంధించిన విచారణను కొనసాగిస్తున్న ధర్మాసనం.. గత ఏడాది డిసెంబరు 19న తమిళనాడు ప్రభుత్వ వాదనలు విన్నది.ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన వ్యక్తుల మెమోరియల్‌ను నిర్మించకూడదంటూ పిటిషనర్ ఎమ్‌ఎల్‌ రవి ఈ పిల్‌ను దాఖలు చేశారు. ‌ రూ.50 కోట్లతో మార్చి 2019లోగా ఈ మెమోరియల్‌ నిర్మాణాన్ని పూర్తి చేయాలనుకుంటున్నట్లు అప్పట్లో తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. సర్కారు వాదనను రికార్డు చేసిన న్యాయస్థానం ఈ కేసును రిజర్వులో ఉంచింది. మాజీ ముఖ్యమంత్రుల స్మారక చిహ్నాలను నిర్మించడం కొత్త విషయం ఏమీ కాదని కూడా ప్రభుత్వం తెలిపింది. ప్రజల్లో ఆదరణ ఉన్న గొప్ప నాయకురాలు జయలలిత అని, ఆమె మెమోరియల్‌ నిర్మించాల్సి ఉందని పేర్కొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos