అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా బడ్జెట్ను ప్రవేశపెట్టామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర బడ్జెట్ పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందని చెప్పారు. తెదేపా నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్ని ఆర్థిక కష్టాలున్నా.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామంటే మన సమర్థతే కారణమన్నారు. సమాజంలో ఎవరినీ నిరాదరణకు గురికానివ్వమని చెప్పారు. తెరాస అధినేత కేసీఆర్, వైకాపా అధ్యక్షుడు జగన్ తప్ప బెంగాల్ చర్యను అంతా ఖండించారని.. దీంతో ఆ ఇద్దరూ ప్రధాని మోదీ కనుసన్నల్లో ఉన్నారన్నది సుస్పష్టమైందన్నారు.
కుల, మత విద్వేషాలతో అమాయకులకు వల పన్నుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. పేదరిక నిర్మూలనే తమ కులమని.. పేదరికంలో ఉన్నవారిని గుర్తించి తోడ్పాటు అందించే ఏకైక పార్టీ తెదేపా అని సీఎం అన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అందర్నీ పైకి తీసుకొస్తామని చెప్పారు. వ్యవసాయం పండగ పేరిట రైతులకు చెక్కులిచ్చే కార్యక్రమాన్ని త్వరలో చేపడతామని చంద్రబాబు వివరించారు.