చలికి వణుకుతూ 16గంటలు విమానంలోనే..

చలికి వణుకుతూ 16గంటలు విమానంలోనే..

మాంట్రియల్‌: దాదాపు 16 గంటల పాటు విమానంలో చలికి వణికిపోతూ ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. తినేందుకు ఆహారం లేక.. విమానం నుంచి బయటకు వచ్చే వీలు లేక యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం న్యూజెర్సీలోని నెవార్క్‌‌కు వెళ్లాల్సి ఉండగా మెడికల్‌ ఎమర్జెన్సీ కారణంగా కెనడాలోని గూసె బే ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా దిగింది. అనారోగ్యానికి గురైన ప్రయాణికుడిని హాస్పిటల్‌కు పంపించిన అనంతరం విమానాన్ని టేకాఫ్‌ చేసేందుకు వీలు పడలేదు.ఆ సమయంలో అక్కడి వాతావరణం మైనస్‌ 30 డిగ్రీల సెల్సియస్‌ ఉండటంతో విమానం తలుపు మూయబోతుండగా బిగుసుకుపోయింది. తలుపు బాగు చేయించేందుకు సిబ్బంది అందుబాటులో లేరు. దీంతో విమానంలోని ప్రయాణికులు రాత్రంతా చలిలోనే వణుకుతూ ఉండిపోయారు. రాత్రివేళ కావడంతో విధుల్లో కస్టమ్స్‌ అధికారులు లేకపోవడంతో విమానం అలాగే ఉండిపోయింది. దాదాపు 16 గంటల పాటు ప్రయాణికులంతా దుప్పట్లు కప్పుకున్నప్పటికీ చలికి తాళలేకపోయారు. ఈ విషయాన్ని విమానంలో ప్రయాణిస్తున్న సంజయ్‌ దత్‌ అనే వ్యక్తి ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. ఆహార పదార్థాలు కూడా లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నామని దయచేసి సహాయం చేయాల్సిందిగా అతడు ట్వీట్‌ చేశాడు. విమానంలో మొత్తం 250 మంది ప్రయాణికులున్నారు. తర్వాత అక్కడికి చేరుకున్న సిబ్బంది ప్రయాణికులను బస్సులో వేరే విమానం వద్దకు తరలించి గమ్యస్థానానికి పంపించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos