గణాంకాల సంఘానికి ఇద్దరు రాజీనామా

దిల్లీ: జాతీయ గణాంకాల సంఘం(నేషనల్‌ స్టాటిస్టికల్‌ కమిషన్‌) నుంచి ఇద్దరు స్వతంత్ర సభ్యులు రాజీనామా చేశారు. కొన్ని అంశాల్లో ప్రభుత్వంతో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో వీరు తమ పదవుల నుంచి తప్పుకున్నారు. వీరిలో ఒకరు తాత్కాలిక ఛైర్‌పర్సన్‌ పీసీ మోహనన్‌ కాగా.. మరొకరు స్వతంత్ర సభ్యురాలు జేవీ మీనాక్షి.ఇటీవల గణాంకాల కమిషన్ విడుదల చేసిన ఉద్యోగాల డేటాపై ప్రభుత్వం, కమిషన్‌ మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే వీరు రాజీనామా చేశారు. రాజీనామాపై మోహనన్‌ మాట్లాడుతూ.. ‘ఈ మధ్యకాలంలో గణాంకాల కమిషన్‌ సమర్థవంతంగా పనిచేయట్లేదు. అంతేగాక గత కొన్ని నెలలుగా కమిషన్‌లో మమ్మల్ని పక్కనబెడుతూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మా బాధ్యతలను మేం సరిగా నిర్వర్తించలేమని భావించాం. అందుకే మా పదవుల నుంచి తప్పుకొంటున్నాం’ అని చెప్పారు. మోహనన్‌, మీనాక్షి 2017 జూన్‌లో కమిషన్‌ సభ్యులుగా బాధ్యతలు చేపట్టారు. వీరి పదవీకాలం 2020 జూన్‌ వరకు ఉంది.గణాంకాల కమిషన్‌లో ఏడుగురు సభ్యులు ఉండాలి. అయితే ఇప్పటికే ఇందులో మూడు పదవులు ఖాళీగా ఉన్నాయి. తాజాగా వీరి రాజీనామాతో కమిషన్‌లో సభ్యుల సంఖ్య ఇద్దరికి పడిపోయింది. ప్రస్తుతం ప్రధాన గణాంకాల అధికారి ప్రవీణ్‌ శ్రీవాస్తవ, నీతీ ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ సభ్యులుగా ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos