ఖాళీ కొబ్బరి చిప్ప రూ.1,400!

ఖాళీ కొబ్బరి చిప్ప రూ.1,400!

సాధారణంగా కొబ్బరికాయ సుమారు రూ.20 నుంచి రూ.30 వరకూ ఉంటుంది కదా..! కాయ నుంచి తీసిన ఖాళీ చిప్పలు అంతకంటే తక్కువకే లభ్యమవుతాయి. మరి రూ.1,400 ధర ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? ఓ ఖాళీ చిప్ప ఖరీదు అమెజాన్‌లో ఇంతే ఉంది మరి! కనీసం దానికి ప్రత్యేక రంగులు, ఇతర హంగులేమీ అద్దలేదు. ఈ సహజ కొబ్బరి చిప్పను ఆన్‌లైన్‌లో చూసిన ఐపీఎస్‌ అధికారి రెమా రాజేశ్వరి ఆశ్చర్యపోయి దాన్ని ట్విటర్‌లో పంచుకున్నారు. దీనికి సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను పోస్ట్‌ చేశారు. ఈ వ్యవహారంలో మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ చిప్ప అసలు ఖరీదు రూ.3 వేలట. 55 శాతం ఆఫర్‌లో భాగంగా రూ.1,365కి లభిస్తోంది. పైగా దీని సైజు కూడా ఒకటిన్నర అంగుళాల ఎత్తు, నాలుగున్నర అంగుళాల వెడల్పు మాత్రమే. ఓ వంద మిల్లీ లీటర్ల నీళ్లు పట్టేంత ఖాళీ మాత్రమే ఉంటుంది.ఇటీవలి కాలంలో కొబ్బరి చిప్పలతో చేసిన బౌల్స్‌ వాడడం ట్రెండ్‌గా మారింది. కొబ్బరి చిప్పలను పాలిష్‌ చేసి, అందమైన రంగులోకి మలుస్తున్న చిప్పలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. కానీ ఇవి ఒక్కొక్కటీ రూ.100లోపే ఉంటున్నాయి. మరి సాధారణ కొబ్బరి చిప్పను ఏకంగా రూ.1,365కు అమ్మడం మాత్రం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఐపీఎస్‌ అధికారి రెమా రాజేశ్వరి ట్వీట్‌పైనా నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos