ముంబై : ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు రాజ్యసభ ఆమోదం పొందుతుందన్న ఆశాభావాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. బుధవారం ఆయన షోలాపూర్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ కొందరు ఈ బిల్లుపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యసభ సభ్యులు ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ బిల్లుకు మద్దతు ఇస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ బిల్లు కోసమే రాజ్యసభ సమావేశాలను ఒక రోజు పొడిగించినట్లు తెలిపారు.
పౌరసత్వ బిల్లును ఆమోదించడం వల్ల అస్సాం, ఈశాన్య రాష్ట్రాలకు ఎటువంటి నష్టం జరగబోదని హామీ ఇస్తున్నట్లు తెలిపారు.
షోలాపూర్ – ఉస్మానాబాద్ 4 లేనింగ్ రోడ్డును మోదీ ప్రారంభించారు. దీనికి 2014లో ఆయన శంకుస్థాపన చేశారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన క్రింద 30 వేల గృహాల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ ఇళ్ళు చెత్త ఏరుకునేవారు, రిక్షా కార్మికులు, బీడీ కార్మికులు వంటి సొంత ఇళ్ళు లేనివారి కోసం నిర్మిస్తారు.