కేసీఆర్.. మమ్మల్ని అభ్యర్థులుగా ప్రకటించొద్దు ప్లీజ్!

కేసీఆర్.. మమ్మల్ని అభ్యర్థులుగా ప్రకటించొద్దు ప్లీజ్!

ఇటీవలే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస సంచలన ఫలితాలను నమోదు చేసింది. అద్భుతమైన విజయాన్ని సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఈ సంచలన విజయం లోక్ సభ ఎన్నికలను ఎదుర్కొనడం విషయంలో తెరాస నేతలకు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చింది. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రంలోని 17 సీట్లకు గానూ 15 ఎంపీ సీట్లను నెగ్గుతామని తెరాస అధినేత అంటున్నాడు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఓట్ల సంఖ్య కూడికల ప్రకారం చూసుకుంటే.. ఒక్క ఖమ్మం ఎంపీ సీట్లో మినహాయిస్తే.. మిగతా సీట్లలో తెరాసకే లీడ్ ఉంటుంది.

ఇలాంటి పాజిటివ్ బజ్ తో తెలంగాణ రాష్ట్ర సమితికి మరింత ఊపు లభిస్తోంది. ఈ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసేందుకు నేతల పోటీ కూడా గట్టిగానే ఉంది. ఇదంతా నిజమే. అయితే కేసీఆర్ కు ఇప్పుడు ఆ పార్టీ నేతలు ఒక విన్నపాన్ని చేసుకుంటున్నారట. ముందస్తుగా మాత్రం తమను అభ్యర్థులుగా ప్రకటించొద్దు.. అని వారు విన్నపాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముందుగా అభ్యర్థులను ప్రకటించాడు కేసీఆర్.

ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించడమే తెరాస విజయంలో కీలకమైన విషయం అని కూడా అనేకమంది విశ్లేషించారు. ఇతర పార్టీలు కూడా అలా చేయాలని.. ఏపీలో పార్టీలు కూడా ముందస్తుగా అభ్యర్థుల ప్రకటన చేయాలని చెబుతున్నారు.

అయితే  తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ టికెట్ పోటీదారులు మాత్రం.. అబ్బే.. ముందస్తుగా అభ్యర్థుల ప్రకటన వద్దు అంటున్నారట. ఎందుకంటే.. ముందస్తుగా అభ్యర్థులుగా తమను ప్రకటించేస్తే ఇప్పటి నుంచి ఖర్చులు పెట్టుకోవాల్సి వస్తుందనేది వీరి భయం!

అసెంబ్లీ ఎన్నికలప్పుడు అదే జరిగిందట. ముందస్తుగా టికెట్ ఖరారు అయిన వాళ్లంతా.. ఖర్చులు పెట్టుకోవాల్సి వచ్చింది. అవతల పార్టీ వాళ్లు తీరా ఎన్నికల ముందు మాత్రమే ఖర్చుపెట్టారు. తెరాస అభ్యర్థులు మాత్రం పోలింగ్ కు నెలన్నర ముందు నుంచినే ఖర్చులు పెట్టుకోవాల్సి వచ్చింది.

దీంతో అభ్యర్థుల ఎన్నికల ఖర్చు తడిసి మోపెడు అయ్యిందట. అందుకే లోక్ సభ ఎన్నికల విషయంలో ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని వారు కోరుతున్నారట. నామినేషన్ల సమయం వరకూ అభ్యర్థుల ప్రకటన చేయొద్దని ఇప్పటికే కేసీఆర్ వద్దకు విన్నపాలు వెళ్లాయని సమాచారం!

తాజా సమాచారం

Latest Posts

Featured Videos