కుప్పానికి నీళ్లు.. మాకు కన్నీళ్లా?

కుప్పానికి నీళ్లు.. మాకు కన్నీళ్లా?

‘ధర్మవరం నియోజకవర్గంలో ఎన్ని చెరువులు ఎండిపోయాయి? ఎంత భూమి బీళ్లుగా ఉన్నాయో తెలియడం లేదా? పంటలు పెట్టుకునే పరిస్థితి లేక రైతులు వలసలు పోతుంటే చిత్రావతి నుంచి నీళ్లను కుప్పాని తీసుకుపోతామని చంద్రబాబు జీఓ జారీ చేశారు. మీరేమో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తారా? ఇక్కడి ప్రజలకు తాగు, సాగు నీరు వద్దా? ఇలా అయితే మిమ్మల్ని భవిష్యత్తు తరాలు క్షమించవు’ అంటూ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. ధర్మవరంలోని తన స్వగృహంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేతిరెడ్డి మాట్లాడారు.చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి కుప్పానికి నీళ్లు తీసుకుపోవడానికి జారీ చేసిన జీఓ ఆర్‌టీ నంబర్‌ 78ను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. 2000 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా కుప్పానికి తీసుకుపోవడం అంటే ప్రాజెక్ట్‌ మొత్తం ఖాళీ కావడమేనన్నారు. ధర్మవరం నియోజకవర్గం పరిధిలో తాగునీరు చేసేందుకు తెలుగుదేశం పార్టీ కుట్రలు చేస్తోందని, అందుకు ఇక్కడి నాయకులు వత్తాసు పలుకుతూ నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్రావతి రిజర్వాయర్‌ నుంచి ధర్మవరం, కదిరి, పుట్టపర్తి, పులివెందుల మున్సిపాలిటీలతోపాటు యురేనియం ప్రాజెక్ట్‌కు, పులివెందుల రూరల్‌ ప్రాంతాలకు తాగునీరు సరఫరా అవుతున్నాయన్నారు. అంతేకాకుండా నియోజకవర్గ పరిధిలోని తాడిమర్రి, బత్తలపల్లి, ముదిగుబ్బ మండలాలకు రూరల్‌ తాగునీటి ప్రాజెక్ట్‌లకు తాగునీటిని అందించాల్సి ఉందన్నారు. వేసవి వచ్చిందంటే రిజర్వాయర్‌లో నీరు అడుగంటి, తాగేందుకు కూడా సరఫరా చేయలేని దుస్థితిలో ఉంటే మళ్లీ కుప్పానికి నీళ్లు తీసుకుపోతామంటే ఇక్కడి వాళ్ల పరిస్థితేంటని     ప్రశ్నించారు. 

కమీషన్లు తప్ప నష్టంగురించి ఆలోచించవా?
సూరీ తనకొచ్చే కమీషన్ల గురించి తప్ప, చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి కుప్పానికి నీళ్లు తీసుకుపోతే వచ్చే నష్టం గురించి ఆలోచించడం లేదని కేతిరెడ్డి ఆరోపించారు. ధర్మవరం నియోజకవర్గ పరిధిలో మొత్తం 76 చెరువులు ఉన్నాయని, వాటన్నింటి పరిస్థితి ఏంటని నిలదీశారు. ఇప్పటికే సాగునీటికోసం పడరాని పాట్లు పడుతుంటే వారికి నీటి వాటా ఇస్తామని జీఓలు జారీ చేస్తే ఈయన మాత్రం పాలాభిషేకాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. జీఓ 78 వల్ల ధర్మవరం నియోజకవర్గం జీవితాంతం బాధపడాల్సి వస్తుందన్నారు. 
ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం  
కుప్పానికి చిత్రావతి రిజర్వాయర్‌ నుంచి నీళ్లు తీసుకుపోతే ఇక్కడి వాళ్లు తాగేందుకు నీళ్లులేక అలమటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ధర్మవరం నియోజకవర్గానికి సాగు, తాగు నీటి అవసరాలు తీర్చిన తరువాత మిగులు జలాలను ఎక్కడికి తీసుకెళ్లినా తమకు అభ్యంతరం లేదన్నారు. నియోజకవార్గంలోని అన్ని చెరువులూ నింపాలని డిమాండ్‌ చేశారు. ఈ రోజు వారికి హక్కు ఇస్తే జీవితాంతం అనుభవించాల్సి వస్తుందని, ఇందుకు తమ పార్టీ తరపున నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ విషయంపై రైతులందరినీ కలసి జీఓ 78 ద్వారా నియోజకవర్గానికి కలిగే నష్టాన్ని వివరించి, వారందరి మద్దతుతో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos