కార్తీ చిదంబరం విదేశాలకు వెళ్లొచ్చు

కార్తీ చిదంబరం విదేశాలకు వెళ్లొచ్చు

దిల్లీ: ఐఎన్‌ఎక్స్‌ మీడియా, ఎయిర్‌సెల్‌ మ్యాక్సిస్‌ కేసుల్లో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత పి. చిదంబరం కుమారుడు కార్తీకి ఊరట లభించింది. కార్తీ విదేశాలకు వెళ్లేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. అయితే ఇందుకు కొన్ని షరతులు విధించింది. సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో రూ. 10కోట్లు జమ చేసి కార్తీ విదేశాలకు వెళ్లొచ్చని న్యాయస్థానం తెలిపింది. అయితే విచారణకు మాత్రం సహకరించాలని కోర్టు స్పష్టం చేసింది.‘ఫిబ్రవరి 10 నుంచి 26 మధ్య మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటే అక్కడకు వెళ్లొచ్చు. కానీ విచారణకు మాత్రం తప్పకుండా సహకరించాలి. చట్టాలతో ఆడుకోవాలని చూడొద్దు. ఎయిర్‌సెల్‌ మ్యాక్సిస్‌, ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో మార్చి 5, 6, 7, 12 తేదీల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఎదుట తప్పనిసరిగా హాజరుకావాలి. ఒకవేళ మీరు విచారణకు సహకరించకపోతే మేం చాలా చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతమైతే మీరు వెళ్లొచ్చు. అయితే అందుకోసం సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో రూ. 10కోట్లు జమ చేయాల్సి ఉంటుంది’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.అంతర్జాతీయ టెన్సిస్‌ టోర్నమెంట్ల కోసం కొద్ది నెలల పాటు ఫ్రాన్స్‌, స్పెయిన్‌, జర్మనీ, యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కార్తీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఫిబ్రవరి 10 నుంచి 26, మార్చి 23 నుంచి 31 మధ్య తాను విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కావాలని కోరారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఫిబ్రవరి 10 నుంచి 26 మధ్య మాత్రమే కార్తీ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos