కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైకాపా, భాజపా నేతలు కుట్రలు పన్నుతున్నారని తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ప్రతిపక్షాల కుట్రలను సమర్థంగా తిప్పికొట్టాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. తెదేపా నేతలు, కార్యకర్తలతో ఆయన బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కాపు రిజర్వేషన్లపై భాజపా, వైకాపా నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. దిల్లీ వెళ్లి కాపు రిజర్వేషన్ల గురించి అడగలేని అసమర్థులు.. ఇప్పుడు కాపులకు మేలు చేసిన తెదేపాను నిందిస్తున్నారన్నారు. కాపుల రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ఆమోదించి దిల్లీ పంపామని.. దానిపై ఏనాడైనా భాజపా, వైకాపా నేతలు మాట్లాడారా అని ప్రశ్నించారు.కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని నాటి ముఖ్యమంత్రి వైఎస్ మోసం చేశారన్నారు. కాపులకు 5శాతం రిజర్వేషన్లపై భాజపా, వైకాపాకు ఉన్న అభ్యంతరం ఏమిటని చంద్రబాబు నిలదీశారు. అవినీతిని 85 శాతం నియంత్రించామంటూ ప్రధాని మోదీ పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. దావోస్‌లో రఘురామ్ రాజన్ వ్యాఖ్యలు మోదీ పాలనలోని డొల్లతనాన్ని బయట పెట్టాయన్నారు. భాజపా పాలనలో సంస్కరణలు పడకేశాయని ఆందోళన వ్యక్తం చేశారు. విపక్షాల కోల్‌కతా ర్యాలీ ప్రకంపనల నుంచి భాజపా తేరుకోలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, మోదీ వ్యాఖ్యల్లో అదే కనిపిస్తోందన్నారు. ఈవీఎంలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని.. ఆ చర్చను పక్కదారి పట్టించాలని భాజపా చూస్తోందని ధ్వజమెత్తారు. మళ్లీ బ్యాలెట్ పేపర్ కావాలనేది అందరి డిమాండ్ అన్నారు. దావోస్‌లో మంత్రి లోకేశ్ బృందం సత్ఫలితాలు సాధిస్తోందని, ఏపీలో పెట్టుబడులపై అనేక కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. డెలాయిట్, విప్రో, ఎజైల్ గవర్నెన్స్, స్విస్ రే సంస్థలు ముందుకు వచ్చాయని చంద్రబాబు తెలిపారు. కార్యకర్తలు నిరంతరం పార్టీ కోసం పరితపిస్తారని.. 36 ఏళ్లుగా పార్టీ జెండా భుజాన మోస్తున్నారని కొనియాడారు. అంతా ఐక్యంగా పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.