కర్నాటక విధానసభలో కమల కలహం : అర్ధంతరంగా ముగిసిన గవర్నర్ ప్రసంగం

కర్నాటక విధానసభలో కమల కలహం :  అర్ధంతరంగా ముగిసిన  గవర్నర్ ప్రసంగం

బెంగళూరు: బుధవారం ప్రారంభమైన కర్నాటక అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. మూకుమ్మడిగా వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలతో హోరెత్తించడంతో… గవర్నర్ వాజుభాయ్ వాలా తన ప్రసంగాన్ని రెండే రెండు ముక్కలతో సరిపెట్టాల్సి వచ్చింది. ప్రభుత్వం సిద్ధం చేసిన 22 పేజీల బడ్జెట్ ప్రసంగాన్ని 2 పేజీలకు కుదించిన ఆయన… పట్టుమని పదినిమిషాలు కూడా మాట్లాడలేదు. జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిందనీ… బడ్జెట్ ప్రవేశపెట్టే అర్హత ఈ ప్రభుత్వానికి లేదని ఆరోపిస్తూ బీజేపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఒక రోజు ముందుగానే సిద్ధం చేసుకున్న వ్యూహంతో ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలను అడ్డుకోవడంలో పైచేయి సాధించినట్టు కనిపిస్తోంది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబోమని కర్నాటక ప్రతిపక్ష నేత బీఎస్ ఎడ్యూరప్ప చెబుతున్నప్పటికీ… వ్యూహాత్మకంగా ప్రభుత్వాన్ని గద్దె దించే అవకాశాలపై మాత్రం ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ బడ్జెట్ ప్రసంగాన్ని అడ్డుకోవాలని శాసన సభాపక్ష సమావేశంలో నిర్ణయించినట్టు చెబుతున్నారు. మరోవైపు బీజేపీ సభ్యుల అందోళనపై మాజీ శాసనమండలి చైర్మన్, జేడీఎస్ నేత బసవరాజ్ హోరట్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర చరిత్రలోనే ఈ ఘటన మాయని మచ్చ అని పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో విధాన సౌధ వద్ద భద్రత పటిష్టం చేశారు. ఒక డీసీపీ, నలుగురు ఏసీపీల నేతృత్వంలో 6 కేఎస్‌ఆర్పీ ప్లటూన్లు, 200 మంది పోలీసులను విధాన సౌధ వద్ద మోహరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos