రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్): భారతీయ జనతా పార్టీ ఇతర రాష్ట్రాల్లో వ్యవహరించినట్లుగానే కర్ణాటకలోనూ వ్యూహాలు రచిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఆరోపించారు. కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ సర్కారుకి తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ప్రకటించిన అనంతరం ఆ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో థరూర్ మీడియాతో మాట్లాడుతూ… ‘ఆ రాష్ట్రంలో మా ప్రభుత్వం స్థిరంగా ఉంది. అయితే, ఆ రాష్ట్రంలో తప్పుడు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇతర రాష్ట్రాల్లో భాజపా ఏ విధంగా వ్యవహరించిందో ఈ రాష్ట్రంలోనూ అలాగే వ్యవహరించాలని ప్రయత్నిస్తోంది. కర్ణాటకలో ఆ పార్టీ తమ ఓటమిని మర్యాదపూర్వకంగా ఒప్పుకోవాలి. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు మినహా మిగతావారంతా ప్రభుత్వంలోనే ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు. భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా అనారోగ్యానికి గురైన గురైన విషయంపై ఆయన స్పందిస్తూ… ‘ఆయన త్వరగా కోలుకునేలా ఆ దేవుడు ఆశీర్వదించాలి. మేము భాజపా భావజాలానికి మాత్రమే వ్యతిరేకం.’ అని వ్యాఖ్యానించారు.