‘కడపలో ఉక్కు కర్మాగారం నిర్మించేందుకు భాజపా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందుకే టాస్క్‌ఫోర్సు బృందాన్ని ఏర్పాటు చేశాం. అయినా రాష్ట్ర ప్రభుత్వం సమాచారం, సహకారం ఇవ్వలేదు. ఏపీ ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల నిధులను కేటాయించాం’ అని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. కడప కందుల ఎస్టేట్‌లో శుక్రవారం సీమ జిల్లాలకు చెందిన భాజపా శక్తి కేంద్రాల ఇన్‌ఛార్జులతో సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్‌నాథ్‌సింగ్ విచ్చేశారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ మంత్రి ఆదినారాయణరెడ్డి, కలెక్టరు హరికిరణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణలు స్వాగతం పలికారు. రోడ్డు మార్గాన రాష్ట్ర అతిథి గృహానికి చేరుకున్నారు. అక్కడ కొద్ది సేపు సేద తీర్చుకుని సాయంత్రం నాలుగు గంటలకు కందుల ఎస్టేట్‌కు చేరుకున్నారు. సభాస్థలి వద్దకు రాగానే మహిళలు ఆయనకు హారతి ఇచ్చారు. వేదికపైకి రాగానే భాజపా శ్రేణులకు అభివాదం చేశారు. కార్యక్రమానికి భాజపా రాష్ట్ర నాయకులు సురేష్‌రెడ్డి అధ్యక్షత వహించారు. హోంమంత్రి ఎన్టీ రామారావుకు నివాళులు అర్పిస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. 2030 నాటికి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో మూడు దేశాల సరసన ఉంచుతారని పేర్కొన్నారు. అప్పటి ప్రధానమంత్రి పీవీ.నరసింహరావు మృతదేహాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్లకుండా చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకు దక్కిందన్నారు. నాలుగున్నరేళ్ల కాలంలో మోదీ అన్ని గ్రామాలకు విద్యుత్తును అందజేశారని తెలిపారు. ఉజ్వల పథకం ద్వారా పేద కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చిన గొప్ప వ్యక్తి మోదీ అన్నారు. 2022 నాటికి అందరికి సొంతింటి కలను నెరవేర్చే బాధ్యత భాజపా తీసుకుందన్నారు. గతంలో మన దేశానికి చెందిన భద్రత సిబ్బంది ఎక్కువ మంది ప్రత్యర్థి దేశాల చేతిలో చనిపోయే వారన్నారు. గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో వందల సంఖ్యలో ప్రత్యర్థి దేశానికి సంబంధించిన టెర్రరిస్టులు చనిపోతున్నారని చెప్పారు. చంద్రబాబు నాయుడు పదే పదే ప్రత్యేక హోదా ఇవ్వాలని అడుగుతున్నారన్నారు. ఏపీ ప్రత్యేక హోదా ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామన్నారు. విభజన చట్టంలో 80 శాతం మేరకు హామీలను అమలు పరిచామన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నరేంద్ర మోదీ కట్టుబడి ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరారు. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ మాట్లాడుతూ.. జన్మభూమి కమిటీల పేరిట డబ్బులన్నింటినీ వృథా చేశారని పేర్కొన్నారు. నరేంద్ర మోదీ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారని తెలిపారు. మోదీని ఢీకొట్టే నాయకుడే భారతదేశంలో లేరన్నారు. మహాకూటమి వల్ల ఏమి కాదన్నారు. చంద్రబాబునాయుడు దేశాన్ని కాపాడుతా అంటున్నారు, అంతకంటే ముందు తన సీటును తాను కాపాడుకోవాలని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ మహానుభావుడని తెలిపారు. కార్యక్రమంలో భాజపా జాతీయ కార్యదర్శి సునీల్ డియోధర్, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రవీంద్రరాజు, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుల రాజమోహన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్‌రెడ్డి, శాసనసభ్యులు మాధవ్, మాజీ శాసనసభ్యులు పార్థసారధి, శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు రమేష్‌నాయుడు, భాజపా జాతీయ కోర్ కమిటీ నాయకులు శాంతారెడ్డి, మాకం అశోక్‌కుమార్, నాయకులు శశిభూషన్‌రెడ్డి, బండి ప్రభాకర్, శ్రీనాథ్‌రెడ్డి, కోలా ఆనంద్, చల్లపల్లి నరసింహారెడ్డి, సత్య, దేవిరెడ్డి హంసదేవి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
రాజ్‌నాథ్‌సింగ్‌కు ఘన స్వాగతం
ఎన్‌జీవో కాలనీ : కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు కడపలో ఘన స్వాగతం లభించింది. శుక్రవారం మధ్యాహ్నం కడప ఎయిర్‌ఫోర్టు నుంచి నేరుగా నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి ఆయన చేరుకున్నారు. అక్కడ బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. తరువాత గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఉపాధ్యాయ సంఘాల నుంచి పలు వినతిపత్రాలను ఆయన స్వీకరించారు. జాతీయ బాషగా హిందీని ప్రకటించాలని అప్పట్లోనే ‘అధికారిక భాష చట్టం -1963’ను తీసుకొచ్చారని తెలిపారు. కానీ దేశ వ్యాప్తంగా కొన్ని చోట్ల నిరసనలు వ్యక్తమవడంతో ప్రకటనను వాయిదా వేసుకొన్నారు. దీంతో ఇప్పటి వరకు హిందీని జాతీయ భాషగా ప్రకటించలేదని ఉపాధ్యాయ సంఘాలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీంతో హోం మంత్రి పరిశీలించి చర్యలు తీసుకొంటామని తెలిపారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా నగరంలోని కందుల మైదానానికి చేరుకున్నారు.